మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించడం, ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం చాలా సందర్భాల్లో చూసుంటారు. కొందరైతే పోలీసుల మీదే చేయి చేసుకున్న వాళ్లు ఉన్నారు. అలాంటి వారికి జైల్లో రాచమర్యాదలు చేసి బయటకు పంపుతూ ఉంటారు. కొందరు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి సెలబ్రిటీలు అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి మరో వ్యక్తి చేరాడు. ఒక్క రోజు జైలు జీవితం గడిపి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సెలబ్రిటీ మాదిరి అవకాశాలు కూడా వస్తున్నాయి.
ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. కైమూరుకు చెందిన కన్హయ్యరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో కన్హయ్యరాజ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఒకరోజు జైలు జీవితం కూడా గడిపాడు. అయతే జైలులో ఉన్నప్పుడు కన్హయ్యరాజ్ పాటలు పాడాడు. ఆ పాటలను పోలీసులు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పాట కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. దాంతో కన్హయ్యరాజ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
కటకటాల మధ్య కూర్చుని కన్హయ్య రాజ్ పాడిన భోజ్ పురీ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అయితే కన్హయ్య రాజ్ తాను మద్యం మత్తులో అరెస్టు కాలేదని చెబుతున్నాడు. తాను పాడే పాటల్లో అశ్లీలత ఉందంటూ ఎవరో ఫిర్యాదు చేయగా తనని అరెస్టు చేసినట్లు చెబుతున్నాడు. తాను పదో తరగతి వరకు చదువుకున్నాడని, 2018 నుంచి పాటలు పాడుతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం కన్హయ్య రాజ్ పాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతనికి పాటలు పాడేందుకు అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలిపాడు.