పెరుగుతున్న సాంకేతికత, అభివృద్ధి, మారుతున్న జీవన విధానం.. ఎన్నో మార్పులు చేసుకుంటున్నా ఇంకా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగడానికి కారణం ఏంటని మీరు గమనించారా? ప్రయాణికులు ఎక్కువైపోయారని అనుకుంటున్నారా? నిజం అది కాదు, బోగీలను తగ్గించేయడం వల్లే రద్దీ పెరిగిపోతుంది. ఈ దేశంలో 60 శాతం మంది పైగా సామాన్యులు, పేద ప్రజలు జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఫలానా రైలుకి ఉండాల్సినన్ని జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలు ఇప్పుడు ఉన్నాయా? అంటే లేవు. దీనికి కారణం?
ఈ దేశంలో పేదలు, సామాన్యులే ఎక్కువ శాతం మంది ఉన్నారు. వలస కూలీలు, పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇందులో ఎక్కువగా జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల్లోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే రైల్వే శాఖ వీరి మీద నిర్లక్ష్యం చూపిస్తుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రైళ్లలో ఏసీ బోగీలను పెంచాలని భావిస్తోంది. జనరల్ బోగీలను ఏదో నామమాత్రంగా ఒకటి, రెండు ఉంచి స్లీపర్ క్లాస్ బోగీలను తగ్గించేయడం గత కొంతకాలంగా ఎక్కువైంది. ఈ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు నరకం చూస్తున్నారు. ఏసీ బోగీల్లో అత్యధిక ధర పెట్టి టికెట్ కొని ప్రయాణం చేయలేరు. అలా అని జనరల్ బోగీలో నలిగిపోతూ ప్రయాణం చేయలేరు. కానీ తప్పక నరకం అనుభవిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే చాలా రైళ్లలో ఇదే దుస్థితి నెలకొంది. ఏంటీ అన్యాయం అని అడిగితే పట్టించుకునే నాధుడే లేడు. రైల్వే అధికారులను అడిగితే పై నుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేయడమే మా డ్యూటీ అని చెప్తారు. అన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల జనరల్ బోగీల్లో ప్రయాణం అంటే ప్రయాణికులకు నరకం కనబడుతోంది. దాదాపు చాలా రైళ్లలో జనరల్ బోగీలు రెండే ఉంటున్నాయి. కొన్నిటికి అయితే మరీ దారుణంగా ఒక బోగీనే ఉంటుంది. దీంతో సాధారణ టికెట్ తీసుకునే ప్రయాణికులు చచ్చినట్టు రెండు బోగీల్లో లేదా ఒక బోగీలో ఊపిరి బిగబట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒంటి కాలిపై నిలుచుని ప్రయాణం చేసే దుస్థితి కూడా లేకపోలేదు.
కిక్కిరిసిపోయే జనం మధ్యలో కాలు కదపలేని పరిస్థితి. చోటు లేక కొంతమంది అయితే బాత్రూంలలో కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా అని పేద ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక స్లీపర్ బోగీల్లో ప్రయాణించే దిగువ మధ్యతరగతి వ్యక్తులు, సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రైళ్లలో గతంలో ఉండాల్సిన దాని కంటే ఇంకా స్లీపర్ క్లాస్ బోగీలను తగ్గించి ఆ స్థానంలో ఏసీ బోగీలను పెంచేశారు. దీంతో స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమైపోయింది. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీల్లో వెయిటింగ్ లిస్ట్ 100 నుంచి 150 మధ్య ఉంటోంది. బోగీలు తగ్గించేయడంతో రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వక చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారు ప్రయాణిస్తున్నారు. దీంతో జనరల్ బోగీల్లో ప్రయాణం చేసినట్టే ఉంటుంది.
ఇటు స్లీపర్ బెర్త్ లు దొరక్క, అటు థర్డ్ ఏసీ బెర్త్ బుక్ చేసుకునే ఆర్థిక స్థోమత లేక దిగువ మధ్యతరగతి వ్యక్తులు, సామాన్యులు నరకం చూస్తున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కి ఛార్మినార్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లాలంటే స్లీపర్ క్లాస్ టికెట్ రూ. 425 అవుతుంది. అదే థర్డ్ ఏసీ టికెట్ అయితే రూ. 1150 ఉంటుంది. సెకండ్ ఏసీలో ప్రయాణించాలంటే రూ. 1590, ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేయాలంటే రూ. 2 వేలు పైనే ఉంటుంది. సామాన్యుడికి కనీసం థర్డ్ ఏసీకి పెట్టుకునే స్థోమత ఉండదు. ఇక ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలో ఎలా ప్రయాణించగలరు. ఆర్థిక స్థోమత లేక చాలా మంది స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. కానీ బెర్తులు దొరకడం లేదు. దీంతో జనరల్ బోగీకి, స్లీపర్ క్లాస్ బోగీకి పెద్ద తేడా ఏమీ లేదని వాపోతున్నారు.
భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో గతంలో 9 నుంచి 10 స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటే వాటిని 6కి కుదించారు. గతంలో థర్డ్ ఏసీ బోగీలు 3 ఉంటే ఇప్పుడు 6కి పెంచారు. హౌరా -చెన్నై మెయిల్ లో స్లీపర్ బోగీలు 12 ఉంటే 6 బోగీలను తగ్గించారు. థర్డ్ ఏసీ బోగీలను 9కి పెంచారు. ధన్ బాద్-అలప్పుజ ఎక్స్ ప్రెస్ లో 5 స్లీపర్ బోగీలను తొలగించి.. థర్డ్ ఏసీ బోగీలు 6, సెకండ్ ఏసీ బోగీలు 4 చేర్చారు. విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ లో గతంలో 12 స్లీపర్ బోగీలు ఉండేవి. ఇప్పుడు 7 బోగీలు ఉంచి.. థర్డ్ ఏసీ బోగీల సంఖ్య 4 నుంచి 7కి పెంచారు. విశాఖపట్నం-తిరుపతి మధ్య తిరిగే తిరుమల ఎక్స్ ప్రెస్ లో 10 స్లీపర్ బోగీలు కాస్తా 7 బోగీలు కాగా.. 3 థర్డ్ ఏసీ బోగీలు కాస్తా 6 అయ్యాయి.
భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య తిరిగే విశాఖ ఎక్స్ ప్రెస్ లో గతంలో 12 స్లీపర్ బోగీలు ఉంటే ఇప్పుడు కేవలం 3 బోగీలు మాత్రమే ఉన్నాయి. థర్డ్ ఏసీ బోగీలు గతంలో 3, 4 ఉంటే ఇప్పుడు అవి 10కి పెరిగాయి. ఇందులో జనరల్ బోగీలు రెండు మాత్రమే ఉన్నాయి. షాలిమార్-చెన్నై మధ్య తిరిగే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో థర్డ్ ఏసీ బోగీలు 9 ఉంటే స్లీపర్ బోగీలు 5 మాత్రమే ఉన్నాయి. గతంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బోగీలను పెంచేవి. కానీ ఇప్పుడు ఉన్న జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలను తొలగించి ఆ స్థానంలో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీలను పెంచుతుంది రైల్వే శాఖ. దీంతో సామాన్య ప్రయాణికులు, దిగువ మధ్యతరగతి వ్యక్తులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాబడి పెంచుకోవడానికి ఏసీ బోగీలను పెంచుకోవడంలో తప్పు లేదు కానీ ఉన్న సామాన్యులు ప్రయాణించే బోగీలను తీసేయడం ఎంతవరకూ సమంజసం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.