కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని అనేక మంది నిరూపిస్తూ వచ్చారు. ఈ విషయంలో ఆడవాళ్లు ఏమీ తక్కువ కాదు. పెళ్ళైన ఆడవాళ్లు కూడా అద్భుత విజయాలను సాధిస్తున్నారు. పెళ్ళైతే ఇక జీవితం అయిపోయింది అని అనుకునే మహిళలు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కసారి చరిత్ర చూసుకుంటే పెళ్ళై, పిల్లలు పుట్టిన పుణ్య స్త్రీలు ఎందరో అద్భుతమైన విజయాలను సాధించారు. విజయాలను సాధించడం పక్కన పెట్టండి. చావు ఎదురొస్తున్నా.. బిడ్డను వీపుకి తగిలించుకుని పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన నేల ఇది. అలాంటి ఈ నేల మీద పుట్టిన మహిళలు.. పెళ్ళైపోయిందనో.. పిల్లలు పుట్టేశారనో.. ఇక మా పని అయిపోయిందనో ఆగిపోకూడదు. చరిత్రలోనూ, ప్రస్తుత కాలంలో ఎన్నో కష్టాలను ఎదిరించి విజయాలను సాధిస్తున్న వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి.
అద్భుతమైన విజయాలు సాధించాలని కలలు కనే వారిలో స్ఫూర్తిని నింపే ఎంతోమంది గొప్పవాళ్ళలో దివ్య మిట్టల్ ఒకరు. ముగ్గురు పిల్లల్లో ఒకరైన దివ్య.. చిన్నప్పటి నుంచి చదువులో టాప్. ఢిల్లీలో ఐఐటీ ఇంజనీరింగ్ చేసిన దివ్య.. ఆ తర్వాత బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ లో అత్యధిక జీతంతో ఉద్యోగం సాధించారు. అయితే అంత పెద్ద జీతం తనకు సంతృప్తినివ్వలేదు. లండన్ లో ఉంటే ఏదో కోల్పోతున్న అనుభూతి ఆమెకు కలిగింది. అంతే వెంటనే భారత్ కి వచ్చేయాలని అనుకున్నారు. ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని సొంత గడ్డకు తిరిగి వచ్చేసారు. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యింది.
ఆమె భర్త గగన్ దీప్ సింగ్ ఒక ఐఏఎస్ అధికారి. ఈయన ఉత్తరప్రదేశ్ క్యాడర్ లో ఐఏఎస్ గా ఉన్నారు. దీని కంటే ముందు ఇంజనీర్ గా పని చేశారు. 2011లో కోచింగ్ తీసుకోకుండా అత్యంత క్లిష్టమైన యూపీఎస్సీ పరీక్షల్లో పాసయ్యారు. ఐఏఎస్ గా గగన్ ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఆమె ఆకర్షితులయ్యారు. భర్తలానే తాను కూడా ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆమెకు ఒక స్థిరమైన లక్ష్యం ఏర్పడింది. లండన్ లో లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ ఇవేమీ ఆమెను ఆపలేదు. ఆమె భర్త కూడా ప్రోత్సహించడంతో భర్తలానే కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. కోచింగ్ తీసుకుంటేనే గానీ పాసవ్వడం కష్టం. అలాంటిది కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి సివిల్స్ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఒకపక్క ఇంటి బాధ్యతలు, మరోపక్క ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వడం.. ఈ రెండిటినీ బ్యాలన్స్ చేయడానికి ఆమె చాలా కష్టపడ్డారు. ఇంట్లో ఇల్లాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు. ఈ క్రమంలో ఆమె ఫోకస్ తగ్గేది. మొబైల్ ఫోన్ వల్ల సమయం వృధా అయ్యేది. ఏకాగ్రత కోసం ఆమె చాలా కష్టపడ్డారు. మొత్తానికి ఆమె కష్టపడి ప్రిపేర్ అయ్యి.. 2012 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 68వ ర్యాంక్ సాధించారు. 2011లో గగన్ దీప్ సింగ్ ఐఏఎస్ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తే.. 2013లో దివ్య మిట్టల్ ఐఏఎస్ ఎగ్జామ్ ని క్రాక్ చేశారు. భర్తలా లక్షల్లో వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అయ్యారు. ఇద్దరూ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ క్యాడర్ లో పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ గా సేవలు అందిస్తున్నారు. దీని కంటే ముందు సంత్ కబీర్ నగర్ జిల్లాకు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా పని చేశారు. ఆమె సివిల్ సర్వీస్ లో అడుగుపెట్టిన క్షణం నుంచి సత్తా చాటుతూ వచ్చారు. ముస్సోరిలో శిక్షణలో ఉండగా. అసాధారణ ప్రతిభకు ఫలితంగా అశోక్ బంబావాలే అవార్డు వరించింది. ఆమె ఎలా అయితే కోచింగ్ లేకుండా ఐఏఎస్ కొట్టారో.. అదే విధంగా యువత కూడా కొట్టాలని వారికి మోటివేట్ చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలను క్రాక్ చేయడానికి కావలసిన టిప్స్ ని చెబుతున్నారు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, ముఖ్యంగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏకాగ్రత కోల్పోకుండా ఉండడం కోసం ఆమె పాటించిన చిట్కాలను చెబుతున్నారు.
వాటిలో మొదటిది.. మొబైల్ ఫోన్. మొబైల్ వాడకం వల్ల సమయం తెలియదు. మనకి తెలియకుండానే చాలా సమయం వృధా అవుతుంది. బ్లాకౌట్ (blackout) అనే యాప్ ని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే.. అది రోజూ 6 గంటల పాటు ఇంటర్నెట్ ని నిషేధిస్తుంది. ఈ ఇంటర్నెట్ వల్లే కదా అక్కర్లేని గాసిప్పులు, న్యూస్ లు, న్యూసెన్సులు చూసి మైండ్ పక్కదారి పడుతుంది. అందుకే మొబైల్ కి దూరంగా ఉండాలని దివ్య అంటారు. తెల్లవారుజామున లేచి చదవడం వల్ల చదువు బాగా వంటపడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత బాగుంటుందని చెబుతారు. షార్ట్ స్టడీ సెషన్స్ వల్ల ఏకాగ్రత అనేది తగ్గదని ఆమె చెబుతున్నారు. 90 నుంచి 120 నిమిషాలు చదువుకోవాలని.. 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలని ఆమె సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గి.. ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారని ఆమె చెబుతున్నారు.
ఏకాగ్రత కోల్పోతే కనుక.. ఏకాగ్రతను డెవలప్ చేసుకునే చిట్కా ఆమె చెప్పారు. పెన్, పెన్సిల్ లేదా గోడ మీద ఒక పర్టిక్యులర్ పాయింట్ ని కొంచెం సేపు తల తిప్పకుండా చూస్తూ ఉంటే ఏకాగ్రత పదును పెరుగుతుందని ఆమె అంటారు. అంతేకాదు యూట్యూబ్ లో 40 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉండే బైనరల్ బీట్స్ ని వింటే మంచి ఫలితం ఉంటుందని ఆమె అంటున్నారు. ఇక స్టడీస్ లో వ్యాయాయం, పోషకాహారం చాలా ముఖ్యమని ఆమె చెబుతున్నారు. రోజూ 20 నిమిషాలు నడుస్తూ ప్రకృతికి దగ్గరవ్వాలని.. అలానే సమతుల్యత పోషకాహారం తినాలని అంటున్నారు. చదివేటప్పుడు స్నాక్స్ ని ఎవాయిడ్ చేయాలని ఆమె అంటున్నారు. ఇలా ఆమె ఐఏఎస్ అవ్వాలని కలలు కనే విద్యార్థులకు చిట్కాలు చెబుతూ తన వంతు సహాయం చేస్తున్నారు.