‘‘విక్రం సింగ్ రాథోడ్ ఐపీఎస్.. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. నాలుగు సంవత్సరాల సర్వీస్‌లో నాలుగు ప్రమోషన్లు.. 10 ట్రాన్ఫర్లు.. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనమాట’’ అని విక్రమార్కుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. విక్రం సింగ్ రాథోడ్ గురించి చెబుతూ పోలీస్ ఉన్నతాధికారి ఈ మాటలంటాడు. దేశంలో నిక్కచ్చిగా.. అవినీతికి పాల్పడకుండా.. పై ఆఫీసర్లు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేయకుండా ఉండే ప్రతీ ఒక్క సిన్సియర్ పోలీస్ అధికారి రికార్డు కూడా ఇదే. సిన్సియర్‌గా ఉండేవారికి ఇబ్బందులు, ట్రాన్స్‌ఫర్లు తప్ప ఇంకేమీ ఉండవు.
వీటన్నింటినీ లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుపోయే అధికారులు లక్షల్లో ఒకరుంటారు. అలా లక్షల్లో ఒకరే.. ఐఏఎస్ అధికారి అశోక్ ఖెమ్కా. ఈయన స్టోరీ విక్రం రాథోడ్ కంటే పెద్దది. సాధించిన మెడళ్లు, ప్రమోషన్ల కంటే ట్రాన్స్‌ఫర్లే ఎక్కువ. ఈయన తన 30 ఏళ్ల కెరీర్‌లో 56 సార్లు బదిలీలు పొందారు. ప్రాధాన్యత, పని లేని శాఖల్లోనే పని చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. తన తాజా నిర్ణయంతో మరోసారి వార్తల్లో కెక్కారు. ఆయన వార్తల్లోకెక్కేంతలా ఏం చేశారంటే.. కొద్దిరోజుల ముందు వరకు ఖెమ్కా ఏసీఎస్, సైన్స్, టెక్నాలజీలో బాధ్యతలు నిర్వర్తించే వారు.
కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఈ శాఖను ఉన్నత విద్యాశాఖలో కలిపేసింది. దీంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. తాను పని చేస్తున్న ఉన్నత విద్యాశాఖలో చేయవల్సినంత పని లేదని, తనను ట్రాన్స్‌ఫర్ చేయమని కోరారు. తన స్థాయి అధికారికి వారానికి 40 గంటల పని ఉండాలన్నారు. దీనిపై స్పందించిన సీఎస్ ఆయన్ని ఆర్చీవ్స్ శాఖకు బదిలీ చేశారు. మరి, పని విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉన్న ఐఏఎస్ అధికారి అశోక్ ఖెమ్కా స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.