మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలా మంది ఆన్ కెమెరా ఎంత సౌమ్యంగా ఉంటారో.. ఆఫ్ ది కెమెరా మాత్రం ఉగ్రరూపం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సభలు, వేదికల్లో అయితే తమని ప్రశ్నించినా, నిలదీసినా ఆగ్రహంతో ఊగిపోతారు. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శివాలెత్తుతారు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నించిన వారిని దుర్భాషలాడటం, చేయి చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి కోవుకే చెందిన ఓ మంత్రి వర్యులు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. భూమి పట్టాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఓ మహిళ నేరుగా మంత్రినే నిలదీసింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకొంది. కానీ, ఆ మంత్రి మాత్రం ఆమె చెంప చెళ్లుమనిపించాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం ఛామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో జరిగిన కార్యక్రమానికి గృహనిర్మాణ శాఖ మంత్రి సోమన్న కూడా హాజరయ్యారు. పట్టా భూముల పంపిణీకి ఎంపికైన అర్హులకు పట్టాలు అందజేసేందుకు మంత్రి వచ్చారు. మొత్తం 175 మందికి భూమి పట్టాలను మంజూరు చేశారు. అయితే భూమి పట్టాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని కెంపమ్మ అనే మహిళ ఆరోపించింది. అర్హుల ఎంపికన పారదర్శకంగా జరగలేదని.. స్థానిక కాంగ్రెస్ లీడర్ నంజప్ప చెప్పిన వారికే పట్టాలు మంజూరు చేశారంటూ విమర్శలు చేసింది. ఇదే విషయంలో మహిళ మంత్రి సోమన్నను నిలదీసింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.
కెంపమ్మ నేరుగా స్టేజ్ మీదకు ఎక్కి మంత్రి నిలదీయడంతో మంత్రి ఆగ్రహంతో ఆమె చెంప పగలగొట్టాడు. ఆ మహిళ మంత్రి కాళ్ల మీద పడబోతుంటే.. మంత్రి మాత్రం చెంపలు వాయించాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆ మహిళను స్టేజ్ మీదనుంచి కిందకు తీసుకెళ్లిపోయారు. మంత్రి వర్యులు చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి సోమన్న తీరుపై పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే తప్పు గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టిన మంత్రి వర్యులు మహిళకు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, ప్రజలు మాత్రం ఈ వీడియో వైరల్ చేస్తూ.. మంత్రి తీరుని ఎండగడుతున్నారు. న్యాయం చేయమన్న మహిళపై చేయిచేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మంత్రిగారికే తెలియాల్సిన విషయం. తప్పు జరిగిందని చెబితే న్యాయం చేయాలి, లేదా కనీసం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాలి. కానీ, ఇలా చేయడం మాత్రం తప్పకుండా తప్పనే చెప్పాలి.
#Karnataka
Housing minister and @BJP4Karnataka leader V Somanna was seen slapping a woman during an event held at Chamarajanagar district on Saturday. @IndianExpress pic.twitter.com/B0B8GbbWzJ— Kiran Parashar (@KiranParashar21) October 23, 2022