కొందరు వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లంటే ఎంతో మోజు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనకాడారు. వాహనం ఖరీదు కన్నా.. ఫ్యాన్సీ నంబర్‌కే ఎక్కువ ఖర్చు చేస్తారు కొందరు. తాజాగా ఓ వ్యక్తి స్కూటీ ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశాడు. ఎక్కడంటే...
మనలో కొందరికి ఫ్యాన్సీ నంబర్లు అంటే ఎంతో ప్రీతి. అసలు కన్నా కొసరు ఎక్కువ అన్నట్లు.. బండి ఖర్చు కన్నా.. ఫ్యాన్సీ నంబర్ కోసం అధికంగా ఖర్చు పెడతారు. వేల రూపాయలు పెట్టి కొన్న బండి ఫ్యాన్స్ నంబర్ కోసం లక్షలు ఖర్చు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇక తాజాగా మరో విడ్డూరం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయల విలువైన స్కూటీ కొన్న ఓ వ్యక్తి.. ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశాడు. ఈ సంగతి తెలిసిన వారు.. నీకిదేం పోయే కాలం రా నాయనా.. ఫ్యాన్సీ నంబర్ అది కూడా స్కూటీ ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశావ్.. అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. మరి ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన ఆ ఘనుడు ఎవరో తెలియాలంటే ఇది చదవండి..
ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సిమ్లాకు చెందిన ఓ వాహనదారుడు.. తాను కొత్తగా కొన్న స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకునేందుకు భారీ మొత్తంలో రవాణా శాఖకు సమర్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ నంబర్ కోసం మరో 26 మంది పోటీ పడటం గమనార్హం. ఇక వీరిలో సిమ్లా కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ వేలంలో అత్యధిక ధరకు బిడ్ వేశాడు. HP999999 ఫ్యాన్సీ నంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా కోటి 11 వేల రూపాయలకు బిడ్డింగ్ వేశాడు. ఈ నంబర్ కోసం 26 మంది వేలంలో పాల్గొనగా.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రూ.1,00,11,000 బిడ్ వేశాడు.
వాస్తవానికి ఈ నంబర్ కోసం అధికారులు కేవలం 1000 రూపాయలు మాత్రమే రిజర్వ్ ధరగా ఫిక్స్ చేశారు. శుక్రవారం సాయంత్ర 5 గంటల వరకు వేలానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. అయితే ఈ నంబర్ కోసం ఎవరు అత్యధికంగా కోట్ చేస్తారో.. వారికే ఇస్తారు అధికారులు. ఈ నంబర్ కోసం ఇప్పటికే 26 మంది బిడ్ వేయగా.. అందులో ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలకు పైగా బిడ్ వేశాడు. ఇక ఈ వీఐపీ నంబర్ల జాబితాలో చాలా సంఖ్యలు ఉన్నాయి. అయితే అందరి దృష్టి HP999999 సంఖ్య మీదే ఉంది.
ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ నంబర్ దక్కించుకున్న వ్యక్తి కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేసి స్కూటీ కొనుగోలు చేస్తే.. దాని రిజిస్ట్రేషన్ నంబర్ కోసం మాత్రం ఏకంగా కోటి రూపాయలకు పైనే బిడ్డింగ్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. కోట్ల రూపాయల విలువైన కార్ల కోసం ఫ్యాన్సీ నంబర్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయడం సాధారణం. కానీ స్కూటీ కోసం ఇంత ఖర్చు చేయడం చూసి అధికారులే షాకవుతున్నారు.
బైక్, కారు ఇలా ఏ వాహనం కొన్నా రవాణా శాఖ వాటికి ప్రత్యేకంగా నంబర్లు కేటాయిస్తుంది. అయితే వీఐపీ నంబర్లంటూ రవాణా శాఖ అనేక సిరీస్‌లను అమ్మకానికి ఉంచుతుంది. వీటినే వీఐపీ, వీవీఐపీ, ఫ్యాన్సీ నంబర్లు అంటారు. వీటిని సొంతం చేసుకోవడానికి వాహనదారులు భారీ మొత్తం చెల్లిస్తారు. అయితే సాధారణంగా ఈ నంబర్లకు అధికారులు తక్కువ మొత్తమే కేటాయిస్తారు. కానీ ఒకే నంబర్ కోసం ఎక్కువ మంది పోటీ పడటంతో.. అప్పుడు వేలం నిర్వహిస్తారు. ఎవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో.. వారికే నంబర్ కేటాయిస్తారు. గతేడాది ఏప్రిల్‌లో హరియాణా ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే తరహాలో తన స్కూటీ నంబర్ ప్లేట్ కోసం ఏకంగా 15.44 లక్షల రూపాయలు చెల్లించాడు. మరి ఫ్యాన్సీ నంబర్ల కోసం ఇంత ఖర్చు చేయడం కరెక్టేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.