హాకీ లెజెండ్, ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, హర్యాణ క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ కోచ్ మంత్రిపై ఆరోపణలు, ఫిర్యాదు చేసిన రెండ్రోజుల వ్యవధిలోనే ఛండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్ పై కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం, తప్పుడు ఉద్దేశంతో తాకడం వంటి ఆరోపణలతో సెక్టర్ 26 పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కానీ, క్రీడల మంత్రి ఆ ఆరోపణలను తోసిబుచ్చుతున్నారు. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఛండీగఢ్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జూనియర్ కోచ్ మంత్రిపై నగర ఎస్పీ శ్రుతి అరోరాకి ఫిర్యాదు చేసింది. తర్వాత ఎస్పీ అరోరాతో కలిసి మరో సీనియర్ ఎస్పీ మనీషా చౌదరిని కలిసి కేసు వివరాలను వెల్లడించింది. మొత్తం గంటపాటు ఇద్దరు ఎస్పీలతో ఆ మహిళా కోచ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన తర్వాత కోచ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని, తనకు బెదిరింపులు వస్తున్నట్లు మహిళా కోచ్ ఆరోపించారు. పోలీసులు భద్రత విషయంలో భరోసా కలిగించినట్లు తెలిపారు.
“నాకు ఎస్పీలు భరోసాని ఇచ్చారు. నా భద్రత విషయంలో కూడా నాకు పలు అనుమానాలు ఉన్నాయి. అదే విషయాన్ని నేను పోలీసులకు వెెల్లడించాను. మంత్రి నాతో ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారానే మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య మంత్రి నన్ను లైంగికంగా వేధించారు. పలు సందర్భాల్లో నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నన్ను ఒకసారి సెక్టార్ 7లోని ఆయన నివాసానికి కూడా పిలిపించారు. అక్కడ ఎవరూలేని గదిలో నాతో తప్పుగా ప్రవర్తించారు. నేను అన్నీ విషయాలను పోలీసులకు వివరించాను. భయంతో నేను ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు” అంటూ జూనియర్ మహిళా కోచ్ తెలిపారు. ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ ఎదురుదాడి చేశారు.