ఏ జంటకైనా పెళ్లంటే ఒక తీపి గుర్తు. అందులోనూ హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లంటే ఆ మధురానుభూతే వేరు. ఇల్లంతా పచ్చటి తోరణాలు, బంధువుల సందడి, తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు.. ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే వధూవరుల జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు. ఇంతటి ఆనందాన్ని పంచే పెళ్లిని దేశం మొత్తం తన వైపు చూసేలా జరిపించాడు.. గుజరాత్ కు చెందిన ఓ రైతు. ఇంతకీ ఏం చేశాడనేగా మీ సందేహం. అయితే ఇది చదివేద్దాం..
సూరత్‌కు చెందిన విపుల్ పటేల్ ఓ సాధారణ రైతు. అతనికి ఒక కుమార్తె ఉంది. పేరు.. రిద్ధి. ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. చక్కని వరుడిని చూశాడు. ఇక్కడే ఒక ఆలోచన అతని మదిని తట్టింది. రిద్ధి పెళ్లి ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం వివాహాన్ని సంప్రదాయబద్ధంగా, పర్యావరణహితంగా జరిపించాలని భావించాడు. వివాహా ఆహ్వాన పత్రికల నుంచే ఈ విధానాన్ని మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. బంధువులకు తులసి విత్తనాలతో కూడిన వివాహ పత్రికలను అందించాడు. ఈ విత్తనాలను మట్టిలో నాటి పెంచాల్సిందిగా వారిని కోరాడు.
ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. వధూవరూలిద్దరిని అందంగా ముస్తాబు చేసిన ఎడ్ల బండిలో మండపానికి తీసుకువచ్చాడు. అనంతరం కన్యాదానం చేసే సమయంలో కూతురికి ఒక గిర్ జాతి ఆవును కానుకగా ఇచ్చాడు. ఇక పెళ్లికొచ్చిన బంధుమిత్రులందరికి సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు చేయించి విందును ఏర్పాటు చేశాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించుకుండానే పెళ్లి తంతు పూర్తి చేశాడు. తినే ప్లేట్లు, నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. రీ యూజ్ చేయగలిగే వస్తువులనే ఉపయోగించాడు. పాశ్చాత్త సంస్కృతికి అలవాటు పడుతున్న ఈరోజుల్లో ఈ పెళ్లి అందరకి గుణపాఠాన్ని నేర్పుతోంది. ఈ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.