ప్రేమ.. ఎంతో అద్భుతమైన, అందమైన, ఒక చక్కటి అనుభూతి. ప్రతిఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు, ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటారు. అయితే మనం తరచూ వినే మాటలు ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఇలాంటి వాటితో పనిలేదు అని. కొన్ని సంఘటనల చూశాక ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపితమైంది. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమజటం అందరికీ ఆదర్శం మాత్రమే కాదు.. ఎంతో ప్రత్యేకం కూడా. నాలుగు పదుల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆదర్శం ఏముంది? అంటారా? అయితే వాళ్లు ప్రేమలో పడిన ప్రదేశం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.
మనకంటూ ఏదీ లేదు అనుకునేలా నిరాశ, నిస్పృహలు వారి జీవితాల్లో అలుముకున్నాయి. జీవితం మీద ఆశలేదు, దానికి తోడు ఒత్తిడి, మానసిక అనారోగ్యం కారణంగా మెంటల్ హాస్పిటల్‌లో చేరారు. చెన్నైలోని వెల్లూరుకు చెందిన దీప(36), చెన్నైకి చెందిన మహేంద్రన్(42) మానసిక రుగ్మతల కారణంగా కల్పకం అనే మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దీప తండ్రి చనిపోవడం వల్ల ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆమెకు అసలు పెళ్లి జరుగుతాం అనే అనుమానంలో ఉండిపోయింది. అటు మహేంద్రన్ కూడా మానసికంగా కుంగుబాటుతనంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలోనే వారివురి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
వారి ప్రేమ అక్కడి నుంచి పెళ్లిపీటలు వరకు వచ్చేసింది. ప్రేమ, పెళ్లికి వయసుతో సంబంధం లేదని వాళ్లు నిరూపించారు. వాళ్లు అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి సోషల్ మీడియాలోనే కాదు.. అటు స్థానికంగానూ వైరల్‌గా మారింది. లేటు వయసులో పెళ్లి చేసుకున్నా కూడా.. వారి సమస్యలను, పరిస్థితులను అధిగమించి.. ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలబడిన తీరు అందరినీ అభినందించేలా చేస్తోంది. మొదట దీపను చూడగానే తన తల్లిని చూసినట్లు అనిపించిందని మహేంద్రన్ చెప్పుకొచ్చాడు. దీప కూడా తనకు తండ్రిలేని లోటుని మహేంద్రన్ తీర్చగలడనే నమ్మకాన్ని వెల్లిబుచ్చింది. తండ్రిలేని జీవితం ఆమెకు శూన్యంగా అనిపించిన సమయంలో మహేంద్రన్ ఓ వెలుగులా తన జీవితంలో అడుగుపెట్టాడంటూ మురిసిపోయింది.