ఒడిశా రాష్ట్రం వరుస రైలు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనను మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి రైలు కింద పడి ఆరుగురు రైల్వే కార్మికులు చనిపోగా.. మరో ఎక్స్ ప్రెస్ లో రైలులో మంటలు వ్యాపించాయి.
ఒడిశాలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం యావత్ దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే బుధవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఒడిశాలోని జాజ్ పూర్ రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు బోగీల కింద పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇంజన్ లేని గూడ్స్ రైలు కొంతకాలంగా ఆ స్టేషన్ లో ఉంటుంది. వర్షం రావడంతో కార్మికులు ఆ రైలు బోగీ కింద తలదాచుకున్నారు. ఆ సమయంలో భారీ ఈదురుగాలులు రావడంతో బోగీలు ముందుకు కదిలాయి.
దీంతో చక్రాల కింద పడి ఆరుగురు కూలీలు చనిపోగా, మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. ఊహించని విధంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలా వరుస విషాదాలు నెలకొంటున్న క్రమంలో మరో రైలు ప్రమాదానికి గురైంది. దుర్గ్-పూరీ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీ కింది భాగంలో మంటలు చెలరేగాయి. నౌపడ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 18426 నంబర్ రైలు గురువారం సాయంత్రం ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ నుంచి ఒడిశాలోని పూరీకి బయలుదేరింది. రాత్రి 10.07 నిమిషాల సమయంలో ఖరియార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏసీ బోగీలోంచి నల్లటి పొగలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత చక్రాల కింద మంటలు వ్యాపించాయి.
ప్రయాణికులు సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలుని ఆపేశారు. అనంతరం ఏసీ బోగీ నుంచి బయటకు వచ్చేశారు. బీ3 కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. చక్రాల వద్ద ఉన్న బ్రేక్స్ జామ్ కావడం వల్ల రాపిడికి గురై మంటలు వచ్చాయని అధికారులు నిర్ధారించారు. ఆ సమయంలో అలారం చైన్ పుల్లింగ్ పని చేయలేదని వెల్లడించారు. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు బ్రేక్స్ ను సరి చేయడంతో దుర్గ్-పూరీ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11 గంటల సమయంలో పూరీకి బయలుదేరింది.
Odisha | Fire breaks out in an AC compartment of Durg Puri Express. pic.twitter.com/qoveI5KKIQ
— TOI Bhubaneswar (@TOIBhubaneswar) June 8, 2023
🚨BREAKING NEWS: Fire Breaks Out in AC Coach of Puri-Durg Express! 🚂🔥
A distressing incident has occurred aboard the Puri-Durg Express as a fire broke out in one of the AC coaches. Here’s what we know so far:
The fire is believed to have originated from the brake shoes,… pic.twitter.com/bfcKtl0xNv
— Arsh (@ArshIsmail) June 8, 2023