స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. సోషల్ మీడియా వేదికలన్నీ అరచేతిలో వైకుంఠాన్ని తలపిస్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వేదికేదైనా.. ఫోటోలతో, రీల్స్ తో నింపేయాల్సిందే. అయితే ఈ సోషల్ మీడియా వేదికల కారణంగా మోసపూరిత ఘటనలు కూడా చాలానే చోటుచేసుకున్నాయి. కానీ ఓ యువతికి మాత్రం వరంగా మారింది. ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్టు ఆమె న్యాయ పోరాటంలో గెలగవడమే కాదూ… ఆమె జీవితం నాశనమవ్వడమే కాకుండా కాపాడిందీ అంటే నమ్మగలరా..? అవునండి.. నిజమండి.. కావాలంటే ఇది చదవండి..
బాల్య వివాహాలు రద్దుకు ఎన్ని చట్టాలు చేసినా.. దేశంలోని ఏదో మూలన గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతూనే ఉంటాయి. అభం, శుభం తెలియని ఆడపిల్లలెందరో దీనికి బలయ్యారు. అలాంటి బాధితురాలే సుశీల్ బిష్ణోయ్. గతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే రాజస్తాన్ రాష్ర్టంలో పుట్టింది. 12 ఏళ్లు నిండకుండానే..తనకన్నా ఆరేళ్లు పెద్దవాడైన నరేష్ తో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పటి నుండి పుట్టింట్లోనే గడిపింది. 18 ఏ ళ్లు నిండగానే.. అత్తింటి వారు తీసుకు వెళ్లేందుకు రాగా, ఆమె తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడితో వెళ్లక తప్ప లేదు. అయితే అక్కడి వాతావరణం, కుటుంబ సభ్యుల తీరుతో విసుగుపోయిన యువతి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఏకంగా న్యాయ పోరాటానికి దిగింది.
అత్తింటి నుండి బయటపడ్డ యువతి.. తనకు న్యాయం చేయాలంటూ ఇటువంటి సాయం చేసే సారథి ట్రస్ట్ అనే ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న క్రితి భారతిని కలిసింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి భోరుమంది. దీంతో రంగంలోకి దిగిన భారతి.. సుశీల బంధువులను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరారు. అయితే ఏ ఒక్కరూ కూడా సహకరించలేదు, రాలేదు. అయితే ఫేస్ బుక్ లో సుశీల భర్త.. వారి పెళ్లి నాటి ఫోటోలను షేర్ చేసుకున్నారు. వీటిని సాక్ష్యాలుగా తీసుకుని..వాటిని కోర్టులో అందజేయడంతో, 2017 సెప్టెంబర్ లో జోధ్ పూర్ కోర్టు సుశీలది బాల్య వివాహమే అని తేల్చుతూ.. వీరు పెళ్లిని రద్దు చేసింది. ఆ తర్వాత సుశీల దూర విద్య ద్వారా మంచి మార్కులతో 12 వతరగతి పూర్తి చేసింది. డిగ్రీ కూడా చదివి.. పోలీస్ ఆఫీసర్ అయ్యి, తన లాంటి బాధితుల్ని రక్షించడమే తన ధ్యేయమని సుశీల చెబుతోంది.