దేశంలో దేవుని విగ్రహాలు పాలు, నీళ్లు తాగడం గురించి కథలు కథలుగా విన్నాం, చూశాం. అయితే యుపిలో మాత్రం ఓ ధీరుడి విగ్రహం నీళ్లు కారుస్తుంది. ఆ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు అక్కడికి క్యూ కట్టారు.
దేశంలో భక్తులకు, భక్తికి కొదవలేదు. మనమడిగే కోరికలన్నీ తీర్చాలని రోజూ ధూప, దీప, నైవేద్యాలతో దేవుడికి పూజలు చేసేస్తుంటారు. ఇక ఏ చోటైనా దేవుని విగ్రహం పాలు, నీళ్లు తాగుతోందని వార్తలు రావడం ఆలస్యం..చూసేందుకు ఎగబడిపోతారు జనాలు. ఆ వింతను చూసేందుకు కిలోమీటర్ల మేర బారులు తీస్తారు. అటువంటి ఘటనే ఇటీవల ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ వింతను చూసేందుకు వస్తున్న ప్రజలు.. మొక్కుతుందీ దేవుణ్ణి కాదూ ఓ మహానుభావుణ్ణి. అతడో స్వాతంత్య సంగ్రామ పోరాట యోధుడు.
యుపిలోని ప్రయాగ్ రాజ్ లోని సంగం నగరంలో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ఉంది. ఆ పార్కులో ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం నుండి నీటి చుక్కలు ధారలుగా పడుతున్నాయి. దీంతో ప్రజలు తిలకించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గాలి, నీరు చొరబడలేని కాంస్య విగ్రహం నుండి నీరు రావడంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ వార్త ఆ నోట, ఈ నోట దేశ మొత్తం పాకింది. 2020లోనే ఈ విగ్రహం నుండి నీళ్లు కారుతున్నాయని రజనీకాంత్ అనే వ్యక్తి గమనించి..నీళ్లు శుభ్రం చేశాడు. ఆ తర్వాత కూడా ధారాళంగా వస్తుండటంతో విషయాన్ని పలువురికి చెప్పాడు. ఎవ్వరూ నమ్మకలేదు. రెండవ స్వాతంత్య్ర ఉద్యమ జాతీయ కన్వీనర్ డా. నీరజ్ చెప్పగా.. అతడు వెళ్లి చూడగా.. నీటి బిందువులు రావడాన్ని గమనించారు. ఆ తర్వాత గార్డెన్ సూపరింటెండెంట్ ఉమేష్ చంద్రకు చెప్పారు.
ఈ విగ్రహాన్ని పరిశీలించేందుకు మరమ్మత్తుల సంస్థను పిలిపించారు. ప్రస్తుతం అక్కడ మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. ఈ విగ్రహం నుండి నీళ్లు రావడం పట్ల ప్రజలు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆయన ఆత్మ ఘోషిస్తుందని కొందరంటుంటే..మరికొందరు దేవుడిగా కొలిచేస్తున్నారు. ఆ విగ్రహం నుండి వస్తున్న నీటిని నుదుటి మీద రాసుకుంటున్నారు. మరికొంత మంది ఆ నీటిలో కుంకుమ చల్లి వీర తిలకంగా దిద్దుకుంటున్నారు. అయితే విగ్రహానికి పగుళ్లు ఏర్పడి ఇలా ఉండవచ్చుని, శీతాకాలం కావడంతో నీరు వస్తుందని ఉమేష్ చంద్రతో పాటు అలహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ రామేంద్ర కుమార్ సింగ్ అంటున్నారు. ఏదేమైనా అదొక మిరాకిల్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆజాద్ కాంస్య విగ్రహం నుండి నీరు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి