మనిషికి దేవుడు జన్మనిస్తే.. చావు బతుకుల్లో ఉండే వారికి పునఃజన్మనిచ్చేది వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరిః అంటారు.. డాక్టర్లను దేవుడితో పోల్చుతారు. అలాంటిది కొంత మంది డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డాక్టర్లు చేసిన పని వల్ల మహిళ ఐదేళ్లు నరకం అనుభవించింది. ఒక మహిళకు కడుపు నొప్పి విపరీతంగా రావడంతో డాక్టర్ల వద్దకు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా ఆమె కడుపులో ఫోర్సెప్స్ ఉన్నట్లు తేలింది. దాని వల్లనే ఆమెకు కడుపు నొప్పి వస్తుందని వైద్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం ఆమెకు జరిగిన ఆపరేషన్ సమయంలో డాక్టర్లు కడుపులో ఫోర్సెప్స్ మరిచిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమె వారిపై కేసు నమోదు చేసి న్యాయపోరాటం చేసింది. ఈ ఘటన కేరళాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కేరళ కోజికోడ్‌లో హర్షినా అనే మహిళ గత ఆరు నెలలు గా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్ లెట్స్ వాడుతున్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపించకపోవడంతో డాక్టర్ల వద్దకు వెళ్లింది. హర్షినాకు స్కానింగ్ తీసి చూడగా భయంకరమైన నిజం బయట పడింది. ఆమె కడుపులో ఒక మెటల్ లాంటిది ఉండటం వల్లనే కడుపు నొప్పి వస్తుందని డాక్టర్లు తెలిపారు. 2017 హర్షినా కొజికోడ్ మెడికల్ కాలేజ్ లో ఆపరేషన్ చేయించుకుంది.. అది ఆమెకు మూడవది. అంతకు ముందు రెండు ఆపరేషన్లు జరిగిన్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మూడోసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కడుపు నొప్పి రావడం మొదలైంది. తనకు మూడు సార్లు సిజేరియన్ కావడం వల్లనే నొప్పి వస్తుందని భావించింది హర్షినా.
గత ఆరె నెలల నుంచి కడుపు నొప్పి భరించలేనంతగా రావడంతో ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీయించుకొని రిపోర్ట్ చూసి కంగారు పడింది. ఆమె కడుపులో ఫోర్సెప్స్ ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. అది ఇన్ ఫెక్షన్ కావడం వల్లనే ఆమెకు నొప్పి వస్తుందని అన్నారు. తన పరిస్థితి గమనించిన ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్లు హర్షినాకు ఆపరేషన్ చేసి ఫోర్సెప్స్ తీసివేశారు. ఐదేళ్ళ క్రితం ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత ఫోర్సెప్స్ కడుపులో మర్చిపోవడం వల్లనే తాను ఇన్నాళ్లు నరకం అనుభవించానని హర్షినా డాక్టర్లపై ఫిర్యాదు చేసింది.
హర్షినా ఫిర్యాదుపై స్పందించిన కేరళ హెల్త్ మినిష్టర్ వీణా జార్జ్ ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇందుకు సంబంధించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తాని వైద్యులు చేసిన తప్పిదం వల్ల ఐదేళ్లు నరకం అనుభవించిన ఆ మహిళకు న్యాయం జరగాలని పలువురు కోరుకుంటున్నారు.