ప్రయాణికులు ప్రయాణించే విమానం, రైల్, బస్సు ఇతర ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ కి తరుచూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తుంటాం. బాంబు డిస్పోజనల్ స్క్వాడ్ తనీఖీలు చేసి ఏం లేదని చెప్పిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
సాధారణంగా రవాణా వ్యవస్థలకు సంబంధించిన ట్రైన్, బస్సు, విమానాల్లో బాంబు పెట్టినట్లుగా ఫేక్ కాల్స్ చేస్తూ ప్రయాణీకులను కంగారు పెడుతుంటారు. బాంబు బెదిరింపు కాల్స్ సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు కూడా వస్తుంటాయి. హుటాహుటిన బాంబు స్క్వాడ్ స్పాట్ కి చేరుకొని ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దేశంలో ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఢిల్లీ-పుణె వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల విమానాలకు తరుచూ బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న విస్తార విమానంలో బాంబు పెట్టినట్లు శుక్రవారం జీఎంఆర్ కాల్ సెంటర్ కి ఫోన్ రావడంతో ఒక్కసారే ఉలిక్కి పడ్డారు. వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఐసోలేషన్ బే లో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజనల్ స్క్వాడ్ తనీఖీలు చేసింది. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తమకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న ఆ విమానాన్ని వెంటనే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను వారి లగేజ్ తో పాటు సురక్షితంగా కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ నుంచి పూణే వెళ్లాల్సిన యూకే 971 విమానంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్న కారణంగా జాప్యం జరుగుతుందని.. భద్రతా సంస్థకు తాము సహకరిస్తున్నామని విస్తార ప్రతినిధి తెలిపారు. పోలీసుల తనిఖీలు పూర్తయిన తరువాత, విమానం యథావిధిగా పుణె బయల్దేరుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని.. ఇది ఫేక్ కాల్ అని పోలీసులు తెలిపారు. తప్పుడు బెదిరింపు కాల్ పై కేసు నమోదు చేసుకొని బెదిరింపులకు పాల్పపడిన వారి వివరాలు సేకరించేందు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.