దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 89 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసింది. ఒమిక్రాన్ కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. జన సమూహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించాలని కోరింది. కరోనా పరీక్షలు, నిఘా పెంచడంతో పాటు అవసరమైతే రాత్రి పూట నైట్ కర్ఫ్యూ విధించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా ఫేస్ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. బార్లు, రెస్టారెంట్లలో 50 శాతం సిట్టింగ్‌కు మాత్రమే అనుమతి. వివాహ, అంతక్రియలకు 200 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
ఇది కూడా చదవండి : ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు! మరో సారికి..
మరోవైపు యూపీలో డిసెంబర్ 31 వరకు 144 సెక్షన్ విధించారు. మధ్య ప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించినట్లు సమాచారం. కర్ణాటకలో బహిరంగ ప్రదేశాల్లో సామూహిక వేడుకలు నిషేదించినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేస్తేనే జీతం అందుతుందని ప్రకటించింది.