ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల బోరుబావిలో పడ్డ చిన్నారి అన్న వార్తలు వింటూనే ఉన్నాం. రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఎంతో శ్రమించి చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. కొన్నిసార్లు దురదృష్టం వల్ల చనిపోయినవారు ఉన్నారు. మానవ తప్పిదాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ఎక్కడో అక్కడ బోరు బావిలో పడి చిన్నారి మృతి అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు రెస్క్యూ టీమ్ ఎంతో శ్రమపడి బోరుబావిలో పడ్డ చిన్నారులను రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీటి కోసం బోర్లు వేయడం.. సరైన ఫలితం రాకపోవడంతో వాటిని అలాగే నిర్లక్ష్యంగా వదిలి వేస్తున్నారు. కొన్ని సందర్భంగా చిన్నారులకు తెలియకుండా బోరుబావిలో పడి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా కోతులకు భయపడి ఓ ఏడేళ్ల బాలుడు భయంతో పరుగెత్తి అనుకోకుండా బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీమ్ బాలుడి ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఆనంద్పుర్ గ్రామానికి లోకేష్ అహిర్వార్ అనే 7 ఏళ్ల బాలుడు అనుకోకుండా 60 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. లోకేష్ తన తోటి స్నేహితులో పొలాల్లో ఆడుకుంటున్నాడు. అదే సమయానికి అక్కడికి ఒక్కసారిగా కోతుల గుంపు రావడంతో స్నేహితులతో పాటు ఆడుకుంటున్న లోకేష్ భయంతో పరుగెత్తాడు. ఆగితే తనను కోతులు ఎక్కడ కరుస్తాయో అన్న భయంతో కిందకు చూడకుండా పరుగెత్తాడు అంతలోనే ప్రమాదవశాత్తు 60 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. లోకేష్ బోరు బావిలో పడిన విషయం స్నేహితులు గమనించి తల్లిదండ్రులకు, గ్రామస్థులకు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులులతో పాటు మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఓ ఎన్డీఆర్ఎఫ్ బాలుడు పడిపోయిన స్పాట్ కి చేరుకున్నారు. లోకేష్ ఊపిరి తీసుకోవడానికి పైప్ లైన్ ద్వారా ఆక్సీజన్ సరఫరా చేశారు. అలాగే బాలుడి కదలికలను గమనించడానికి సీసీ టీవీని లోపలికి పంపించారు. కొంతమంది సిబ్బంది లోకేష్ తో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. కానీ ఆ బాలుడు మాట్లాడే స్థితిలో లేడని అధికారులు తెలిపారు. ఆ బావిలో దాదాపు 43 అడుగు లోతులో చిక్కుకొని ఉండవొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక బోరు బావి చుట్టు 5 జేసీబీలతో తవ్వడం ప్రారంభించామని.. ప్రస్తుతం 40 అడుగు లోతు వరకు తవ్వగలిగామని.. బాలుడిని తప్పకుండా కాపాడుతామని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ ఒకరు తెలిపారు.
ఇటీవల బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో పొలం యజమానులు నిర్లక్ష్యంగా వదిలివేశారని గ్రామస్థులు తెలిపారు. మరోవైపు తమ బిడ్డ ప్రాణాలతో కాపాడాలని అధికారులను వేడుకుంటూ కన్నీరు మున్నరవుతున్నారు తల్లిదండ్రులు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అహ్మదానగర్ జిల్లాలో సోమవారం ఓ ఐదేళ్ల బాలుడు 200 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడి మృతి చెందాడు. బాలుడి పేరు సాగర్ బుధా బరేలాగా అని పోలీసులు తెలిపారు. ఇటీవల బాలుడి తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం అహ్మదాబాద్ కి వలస వచ్చినట్లు పోలీసులు తెలిపారు.