రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ. 6 వేలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతలుగా రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. తాజాగా రైతుల కోసం కేంద్రం మరో పథకాన్ని తీసుకొచ్చింది. అదే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం. ఈ పథకంలో చేరడం వల్ల అర్హులైన రైతులకి నెలకి రూ. 3 వేలు పెన్షన్ వస్తుంది. ఈ పథకాన్ని దేశంలో ఉన్న చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం కేంద్రం రూపొందించింది. అయితే ఈ పథకం కింద రైతులు నెల నెలా కొంత డబ్బుని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా సొంత డబ్బు కాదు. కేంద్రం ఇచ్చే డబ్బులోంచి కడితే సరిపోతుంది.
ఈ పథకం కింద 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు తమ పేరు నమోదు చేసుకుని చేరవచ్చు. వయసు ప్రకారం ప్రతి నెలా ప్రభుత్వ ఖాతాలో రూ. 55 నుంచి రూ. 200 వరకూ.. ఆ రైతుకి 60 ఏళ్ళు వచ్చే వరకూ చెల్లించాలి. రైతు వయసు 60 ఏళ్ళు దాటగానే ఇక వాయిదా కట్టాల్సిన అవసరం ఉండదు. 60 ఏళ్ళు దాటిన రైతులకు నెలకు రూ. 3 వేలు పెన్షన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరాలంటే.. ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నమోదు చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో మీ పేరును చేర్చడానికి ఒక ఫారంను పూరించి దరఖాస్తు చేసుకోవాలి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా కేంద్ర ప్రభుత్వం జమ చేసే రూ. 6 వేలు నుండి ఆటోమేటిక్ గా ఈ డబ్బులు కట్ అవుతాయి. అంటే నెలకి రూ. 55 నుంచి రూ. 200 వరకూ మీరు ఎంచుకునే వాయిదాను బట్టి ఏడాదికి రూ. 660 నుండి రూ. 2400 వరకూ ఆ అమౌంట్ కట్ అవుతాయి. ప్రత్యేకించి రైతులు పెన్షన్ కోసం డబ్బులు కట్టాల్సిన పని లేదు. రైతులకు ఆల్రెడీ కేంద్రం ఇస్తున్న డబ్బుల నుంచి పెన్షన్ స్కీంకి కావాల్సిన డబ్బుని ప్రభుత్వమే కట్ చేసుకుంటుంది. కట్ చేయగా మిగిలిన డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. 60 ఏళ్ళు రాగానే నెలకి రూ. 3 వేలు పెన్షన్ ఇస్తుంది.
All you need to know about #PMKisanMandhanYojana from which small and marginal #farmers will get ₹3000 per monthhttps://t.co/YjFdrAB24W
— Zee News English (@ZeeNewsEnglish) September 13, 2022