దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసుల సంఖ్య తగ్గడంతో జనజీవనం మళ్లీ యధాప్రకారం సాగుతుంది. ఇంతలోనే ఒమిక్రాన్ వేరియంట్ దేశ ప్రజలను వణికిస్తుంది. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా మహారాష్ట్రపైనే చూపిస్తుంది.
తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు ముంబయిలోనూ, 4 కేసులు పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ వెలుగు చూశాయి. కొత్త కేసులతో కలిపి మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 17కి చేరింది. ఇన్నాళ్లు కరోనాతో వణికిపోయిన మహారాష్ట్రను సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడటంపై నిషేధం విధించారు. ముంబై కమిషనరేట్ పరిధిలో ఈ నిషేధం అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, వాహన ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.
ప్రజలు బయట తిరగడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ఆదేశాలను ధిక్కరించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ముంబైలో ఒమిక్రాన్ బారినపడిన ముగ్గురు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 17, రాజస్థాన్ 9, గుజరాత్ 3, కర్ణాటక 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఉన్నాయి.