టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగుతోంది. లోకేష్ యాత్రలో కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో జనం పాల్గొంటున్నారు. యువగళానికి తమ మద్దతు తెలుపుతున్నారు. లోకేష్ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాటికి పరిష్కారాలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాపురం గ్రామంలో సచివాలయాలు, వాలంటీర్ల ఉద్యోగాలపై ఆయన స్పందించారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారన్న అధికార పార్టీ ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
అధికార వైఎస్సార్ సీపీ చేస్తున్నది తప్పుడు ప్రచారమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎవ్వరికీ అన్యాయం చేయరని అన్నారు. సచివాలయాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సచివాలయ, వాలంటీర్ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వైఎస్సార్ సీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందటం లేదు. పరిశ్రమలు విద్యుత్ ఛార్జీలు, పన్నులకు భయపడి వేరే రాష్ట్రాలకు పారిపోతున్నాయి. జగన్‌కు కమిషన్‌లు కట్టలేక ఏపీని వదిలేస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే.. కొత్త కంపెనీలను రప్పించి యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూస్తాం’’ అని అన్నారు.
కాగా, నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి ఇప్పటికి పది రోజులు పైనే అయింది. వంద కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఆయన 400 రోజులకుపైగా ఈ పాదయాత్రను చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది. దాదాపు ఎన్నికల ముందు వరకు లోకేష్ ప్రజల మధ్యే ఉంటారు. మరి, సచివాలయాలు, వాలంటీర్ ఉద్యోగాలపై లోకేష్ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.