కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళితబంధు పథకాన్ని మునుగోడు నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని ఆయన నిరసనకు దిగాడు. దీంతో ఆయనను ముందస్తుగానే బొంగుళూర్ గేట్ సమీపంలో ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందుగా ఆయన దళిత బంధు కోసం చలో మునుగోడు కార్యక్రమాన్ని కొనసాగించేచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అయన వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు.
మునుగోడుకు రాకుండా అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత బొంగులూరు గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం చౌటుప్పల్‌లో జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రితో వాగ్వాదానికి దిగారు రాజగోపాల్‌రెడ్డి. అంతటితో ఆగకుండా జగదీష్‌రెడ్డి చేతిలో మైక్ లాక్కున్నారు.
దీంతో వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగింది. ఇక పోలీసులు రంగంలోకి గొడవను సద్దుమణిగించారు. ఇక వీరిద్దరి మధ్య మొదట్నుంచి వైరం ఉండటంతో వార్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఇక తాజాగా రాజగోపాల్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా అరెస్టుకు దిగిందని రాజగోపాల్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.