ఛత్తీస్ గఢ్- మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి చెందారని తెలియడంతో ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో విషాద ఛాయలు అలముకున్నాయి. పల్నాడు ప్రాంతం నుంచి ఉద్యమం మొలుపెట్టిన ఆర్కే అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్ట్ అగ్రనేతగా ఎదిగారు.
ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మావోయిస్ట్ ఉద్యమంలోకి రావడం ఆసక్తికరంగా జరిగింది. పక్కా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆర్కే బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసేవారు. యుక్తవయస్సు వచ్చాక ఆయన గ్రామాల్లోనే ఎక్కువగా తిరిగేవారని స్థానికులు చెబుతారు. పల్నాడులో ఉద్యమ నిర్మాణం చేసిన వ్యక్తిగా ఆర్కేకు పేరుంది. మావోయిస్ట్ ఉద్యమంలో భాగంగా పల్నాడు నుంచి గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అక్కడి నుంచి రాష్ట్ర కమిటీలోకి, ఆ తరువాత కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. సౌత్ ఇండియాలో మావోయిస్టు ఉద్యమ నిర్మాణంలో ఆర్కే కీలక పాత్ర పోషించారు.
మవోయిస్ట్ ఉద్యమంలో ఆర్కే వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఒరిస్సా ప్రాంతంలో ఆయన పనిచేశారు. చాలా సందర్బాల్లో ఎన్ కౌంటర్లలో తప్పించుకున్న ఆర్కేను మృత్యుంజయుడిగా అభివర్ణిస్తారు. ఏవోబీలోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బలిమెల ఎన్ కౌంటర్ సమయంలో ఆర్కే బుల్లెట్ గాయాలతో త్రుటిలో తప్పించుకున్నారు. అదే ఎన్ కౌంటర్‌లో ఆయన కుమారుడు మున్నా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య రమాదేవి అలియాస్ శిరీష్ అలియాస్ పద్మక్క ప్రస్తుతం ప్రకాశం జిల్లా అలకూరపాడులో ఉంటోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై అలిపిరిలో జరిగిన బ్లాస్టింగ్‌లో ఆర్కే కీలక సూత్రధారిగా ఉన్నారు. ఒంగోలులో అప్పటి ఎస్పీ మహేష్ చంద్రా లడ్హా కారుకి సమీపంలో బాంబు పేల్చిన ఘటనలోనూ ఆర్కే సూత్రధారిగా ఉన్నారని అంటారు. ఆర్కే పై పోలీసు శాఖ గతంలో 50 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్చలకు పిలిచిన సమయంలో మావోయిస్టులకు ఆర్కే నేతృత్వం వహించారు. అప్పటి వరకు ఆర్కే ఎలా ఉంటారో తెలియదు. వైఎస్ తో చర్చల సందర్బంగానే ఆర్కే ఫోటోలు బయటి ప్రపంచానికి భహిర్గం అయ్యాయి.