తెలుగు దేశం యువ నేత నారా లోకేష్ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ప్రజా సమస్యలపై గళమెత్తి.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ఇక వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం కోసం.. కింద స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించడం కోసం.. త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నాడు. యువగళం పేరటి.. 400 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో.. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు తిరగనున్నాడు. తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యే పాదయాత్ర.. ఇచ్చాపురంలో ముగుస్తుంది. 400 రోజులు పాదయాత్ర అంటే.. దగ్గరిదగ్గర 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా లోకేష్.. ప్రజల్లోనే ఉంటాడు. అయితే ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్రకు.. అనుమతి లభించలేదు. ఆ విషయం పక్కకు పెడితే.. మరి లోకేష్ చేపట్టబోతున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర లక్ష్యమేంటి.. ఏజెండా ఏంటి.. వంటి వివరాలు..
లోకేష్ పాదయాత్రలో యువతను ఆకర్షించడమే ప్రధాన ఎజెండాగా ఉండబోతుందట. పాదయాత్రలో భాగంగా లోకేష్ నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించబోతన్నారని సమాచారం. ఉపాధి కల్పన విషయంలో అధికార పార్టీ ఎలా విఫలం అయ్యింది.. రాష్ట్రంలో నిరుద్యోగం ఏ మేర పెరిగింది వంటి వివరాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కాక.. దీనిపై తెలుగు దేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయాలను.. లోకేష్ పాదయాత్రలో ప్రముఖంగా ప్రచారం చేయబోతున్నారట. దీన్ని ప్రతిబింబించేలా.. పాదయాత్ర పేరు కూడా యువ గళం అని పెట్టారు. దీనిలో భాగంగా.. పాదయాత్రలో యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు రచించారని తెలుస్తోంది.
400 రోజుల పాటు పాదయాత్ర సాగుతుండగా.. లోకేష్ ఒక్కో నియోజకవర్గంలో కనీసం మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించి.. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే.. లోకేష్ ప్రధాన ఎజెండాగా ఉండబోతుందట. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సాగే పాదయాత్రలో ఎక్కువ గ్రామాలను కవర్ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం.. యువత, మహిళలే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది
లోకేష్ పాదయాత్రలో భాగంగా.. ప్రభుత్వ బాధిత వర్గాలను టార్గెట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా.. లోకేష్ ప్రభుత్వ బాధిత వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలానే మహిళలు, రైతుల సమస్యలపై కూడా లోకేష్ పాదయాత్రలో ప్రధానంగా ప్రస్తావిస్తారని సమాచారం. అతేకాక.. రానున్న ఎన్నికల్లో వీరి కోసం టీడీపీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది అనే దాని గురించి లోకేష్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని సమాచారం. మరి లోకేష్ పాదయాత్ర లక్ష్యాలు నెరవేరుతాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.