బుల్లితెర డెస్క్- ఎవరు మీలో కోటీశ్వరులు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ బుల్లితెర షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, తన మాటలతో, ప్రశ్నలు అడగడంలో తనైన శైలితో ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఐతే ఈ షోకు సామాన్యులే కాకుండా మధ్య మధ్యలో సినీ పరిశ్రమకు సంబందించిన సెలబ్రిటీలు సైతం హాజరవుతుండటం వీక్షకులకు మరింత ఉల్లాసాన్ని పంచుతోంది.
ఎవరు మీరో కోటీశ్వరులు షోకు ఇప్పటి వరకు మోగా హీరో రామ్ చరణ్, దేవిశ్రీ ప్రసాద్, థమన్, రాజమౌళి, కొరటాల శివ, సమంత వంటి వారు వచ్చారు. వీరంతా హాట్ సీట్ లో కూర్చుని ఎన్టీఆర్ తో ఈ గేమ్ ఆడి వీక్షకులను అలరించారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు రిలీజ్ చేశారు.
తనకు ఇష్టమైన వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరని ఓ సందర్బంలో ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అదిగో అలాంటి ఇష్టమైన మహేష్ బాబును ఎన్టీఆరే కావాలని కోరి తెచ్చుకుని మరీ పంచులు వేయించుకున్నట్లుగా ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య చాలా సరదా సంబాషణ జరిగిందని ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఓ సందర్బంలో ఎన్టీఆర్ అడిగిన ఒక ప్రశ్నకి.. ఇలా తిప్పి తిప్పి ఎందుకు అడగడం.. అని మహేష్ అంటే.. ఊరికే సరదాగా.. అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు.
మరో సందర్బంలో.. అయ్య బాబోయ్.. నీకంటే కంప్యూటర్ గురువుగారే బెటర్ గా ఉన్నాడు.. అని ఎన్టీఆర్ ని సరదాగా మహేష్ టీజ్ చేశారు. ఇలా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి టీవీ షోలో పాల్గొంటే మరి అభిమానులకు పండగే కదా. అన్నట్లు మహేష్ బాబు పాల్గొన్న ఈ షో డిసెంబర్ 2న ప్రసారం కానుందని సమాచారం. ఈ ప్రోమో విడుదలైన 12 గంటల్లోనే 22 లక్షల వీవ్స్ తో దూసుకుపోతోంది.