జగిత్యాల- ప్రపంచంలో అన్ని బంధాల కన్నా స్నేహ బంధానికి విలువ ఎక్కువ. మనకు కష్టాలు వచ్చినప్పుడు అందరూ వదిలేసి.. ఒంటరిగా ఉన్నప్పుడు.. నేను ఉన్నానంటూ ఆపన్న హస్తం అందిస్తాడు స్నేహితుడు. అంత గొప్ప బంధం కనుకనే.. ప్రాణ స్నేహితుడి మరణ వార్త తట్టుకోలేక.. ఓ యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట కాలనీలో ఉంటున్న పేర్ల ఆనంద్ (20), రేవెల్లి సురేశ్ (19) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. అయితే ఆర్నెళ్ల క్రితం సురేశ్ కుటుంబం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సమీపంలోని పార్నెల్ గ్రామానికి వలస వెళ్లింది. అక్కడ తండ్రి చినసాయిలుతో పాటు సురేశ్ శ్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్న ఓ గదిలో నివాసం ఉండేవాడు.
ఈ క్రమంలో కోరుట్లలో ఉంటున్న ఆనంద్ డిసెంబర్ 31 వేడుకల ఏర్పాట్ల కోసం బైక్ పై బయటకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆనంద్, మరో ఇద్దరితో కలిసి బైక్ పై ఇంటి నుంచి వస్తూ.. గోదాం రోడ్డులో ఎదురుగా వస్తోన్న స్కూటీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆనంద్ తీవ్రంగా గాయపడగా.. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆనంద్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శనివారం సాయంత్రం ఆనంద్ మృతి చెందాడు. ఆనంద్ చనిపోయాడని.. వాట్సాప్ స్టేటస్ లో చూసిన సురేశ్.. విషయం తండ్రికి చెప్పి.. కోరుట్ల వెళ్తానని అడిగాడు. రాత్రి పూట రైళ్లు ఉండవని.. తెల్లారాక.. వెళ్లాలని తండ్రి సూచించడంతో ఆగిపోయాడు.
రాత్రంతా సెల్ లో ఆనంద్ తో దిగిన ఫోటోలు, వీడియోలు చూస్తూ.. బాధపడసాగాడు సురేశ్. అంతేకాక రాత్రి పలుమార్లు.. కోరుట్లలోని తల్లి గంగవ్వకు ఫోన్ చేసి.. ‘అవ్వా.. ఆనంద్ సచ్చిపోయిండా’ అని ఏడ్చినట్లు తెలిసింది. స్నేహితుడి మరణంతో కలత చెందిన సురేశ్.. శ్మశానవాటికలోని గదికి ఉన్న ఇనుప కడ్డీలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణాన్ని ఆదివారం ఉదయం గుర్తించాడు సురేశ్ తండ్రి. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. స్నేహితుల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సురేష్ మృతదేహం కోరుట్లకు చేరుకోగానే ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్నేహితుడి మృతి తట్టుకోలేక ప్రాణం తీసుకున్న ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.