రోడ్డు మీదకు కాలు పెట్టామంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్, కాస్త రద్దీగా ఉండే ప్రాంతంలో.. ముఖం దీనంగా పెట్టుకుని.. పాపం తిండి తినక ఎన్ని రోజులయ్యిందో అనిపించేలా ఉండి.. మట్టికొట్టుకుపోయిన బట్టలు.. గడ్డిలా రేగిన జుట్టుతో కనిపించే భిక్షగాళ్లను చూడగానే.. జాలి అనిపించి.. రూపాయో.. రెండు రూపాయలో దానం చేస్తాం. కానీ మన దగ్గర దానం పొందిన వ్యక్తి.. మరీ అంత పేదవాడు కాదు.. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేని వారని మనం కనీసం ఊహించలేం కూడా. మన దేశంలో చిన్న చిన్న పట్టణాలు మొదలు మెట్రో నగరాల వరకు.. ఎక్కడ చూసిన భిక్షగాళ్లు తప్పక కనిపిస్తారు. చూడ్డానికి కడు బీదరికం అనుభవస్తిన్నట్లు కనిపించే ఈ భిక్షగాళ్లలో కోట్ల ఆస్తులున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎంత సంపాదించినా సరే.. వారు భిక్షాటనను మాత్రం వదలరు. కారణం ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా డబ్బులు సాధించవచ్చనే ఆలోచన.
ఇక ఈ వ్యవస్థను రూపు మాపడం కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసిన లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే మన దేశంలో భిక్షాటన అనేది చట్టారీత్యా నేరం. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి భిక్షాటన చేస్తే.. ఎదుటివారి మంచితనాన్ని ఆసారాగా తీసుకుని మోసానికి పాల్పడిన నేరం కిందకు వస్తుంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా ఈ వ్యవస్థను రూపుమాపడం మాత్రం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భిక్షగాళ్ల దగ్గర నుంచి కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలరం రేపుతోంది. ఆ వివరాలు..
భిక్షగాళ్ల వద్ద నుంచి సుమారు 1.12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని.. ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్లు.. షార్జా పోలీసులు వెల్లడించారు. భిక్షగాళ్ల దగ్గర ఇంత భారీ మొత్తం పట్టుబడటం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు భిక్షగాళ్ల దగ్గర ఇంత మొత్తం ఎలా ఉంది.. అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. మన దేశంలో మాదిరే.. షార్జాలో కూడా భిక్షాటన నేరం. దీన్ని రూపుమాపడం కోసం షారర్జా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తుంటారు. తాజాగా చేపట్టిన డ్రైవ్‌లో పెద్ద ఎత్తున భిక్షగాళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న భిక్షగాళ్ల సంఖ్యపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు షార్జా పోలీసులు 1,111 మంది భిక్షగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో 875 మంది పురుషులుండగా.. 236 మంది మహిళలు ఉన్నారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విజిట్ వీసాపై షార్జా వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా అనారోగ్యం, మెడికల్ ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేవని సాకులు చెబుతూ.. భిక్షాటన చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మసీదులు, మాల్స్ దగ్గర కూర్చుని భిక్షాటన చేస్తుంటారని.. ప్రజల మంచితనాన్ని ఇలా స్వార్థం కోసం వాడుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు.
విజిట్ వీసా మీద వెళ్లిన వాళ్లు.. ఎలాంటి పని చేయకుండా.. అనారోగ్యం, ఆస్పత్రి ఖర్చులు వంచి కారణాలు చెప్పి.. జనాల దగ్గర నుంచి డబ్బులు అడుక్కుంటున్నారు. అలా అడుక్కోగా వచ్చిన మొత్తాన్ని వారి కుటుంబాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో భిక్షగాళ్ల బెడద ఎక్కువగా ఉన్నట్లు షార్జా పోలీసులు తెలిపారు. 2020-21 సంవత్సరంలో 1,409 మంది భిక్షగాళ్లను అరెస్ట్ చేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. వారి వద్ద నుంచి 5,00,000 దిర్హమ్‌ల కంటే ఎక్కువ మొత్తాన్ని(దాదాపు 1.12కోట్లు) స్వాధీనం చేసుకుని.. సీజ్ చేసినట్టు షార్జా పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. షార్జాలో లో భిక్షాటన చేయడం చట్టరీత్యా నేరం. భిక్షమెత్తుతూ ఎవరైనా పట్టుబడితే.. వారికి మూడు నెలల జైలు శిక్షతోపాటు 5000 దిర్హమ్‌ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భిక్షాటనను నిర్వహించిన వ్యక్తులకు కనీసంగా ఆరు నెలల జైలు శిక్షతోపాటు 1,00,000 దిర్హమ్‌ల ఫైన్ విధించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇలాంటి కఠిన చట్టాలు ఎన్ని చేసినా లాభం లేకుండా పోతుంది.