రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ బంగారంపై పడుతోంది. యుద్ధం ప్రకటన వచ్చిన ఒక్కరోజులోనే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1950 డాలర్లు దాటిపోయింది. మల్టీ కమాడిటీ ఎక్స్ ఛేంజీలో బంగారం 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ.51,750కి చేరింది.
హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర కూడా భారీగా పెరిగింది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 930 రూపాయలు పెరిగి రూ.51,110కి చేరింది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి.. రూ.46,850కి చేరుకుంది. వెండి ధర కిలోకి రూ.700 పెరిగి రూ.70,600కు చేరింది. ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర రూ.1170 పెరిగి రూ.65,755 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ప్రపంచ మార్కెట్ లో ఔన్సు వెండి ధర 24.97 డాలర్లుగా ఉంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్లనే బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.