రిషి సునాక్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఈయన ఒక హీరో. ఎందుకో మీకు తెలుసు. బ్రిటన్ దేశానికి ఆయనిప్పుడు ప్రధాని. భారతీయ మూలాలు ఉన్నటువంటి హిందూ వ్యక్తి రిషి సునాక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా ట్రెండింగ్ అయిపోయారు. ఎంతలా అంటే రిషి సునాక్ కులం ఏమిటి? అని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేంత. ఈయన భారతదేశంలో పుట్టనప్పటికీ, ఆయన పూర్వీకులు మాత్రం ఇక్కడే పుట్టారు. వారు పంజాబ్ లో నివసించే వారు. వెయిటర్ నుంచి ప్రధాని వరకూ ఎదిగిన రిషి సునాక్ ప్రస్థానం అజేయం, అచింత్యం, అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం.. ఎంత చెప్పినా తక్కువే.
యూకే అధికారిక ‘కన్జర్వేటివ్ పార్టీ’ తరపున ప్రధానిగా రిషి సునాక్ నిమయమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆయన ప్రధానిగా ఎంపికైన సందర్భంగా ప్రసంగించారు. ఆయన మొదటగా ప్రస్తావించిన అంశం ఆయన భార్య అక్షత గురించే. తన సక్సెస్ కి కారణం అక్షత అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో అక్షత ఎవరు? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్ నారాయణమూర్తి కుమార్తెనే ఈ అక్షత మూర్తి. రిషి, అక్షతలది ప్రేమ వివాహం. రిషి సునాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నప్పుడు అక్షత మూర్తిని కలిశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్తా ప్రేమగా మారింది.
కొన్ని రోజులు కలిసి తిరిగిన ఈ ఇద్దరూ.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో అక్షత తండ్రి నారాయణ మూర్తికి తమ ప్రేమ విషయం చెప్పారు. అయితే మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. దీంతో అక్షత.. రిషి సునాక్ తో ఒకసారి మాట్లాడి నిర్ణయం చెప్పమని అనగా.. ఆమె తండ్రి మాట్లాడేందుకు ఒప్పుకున్నారట. అలా మొదటిసారిగా రిషి సునాక్.. నారాయణ మూర్తితో మాట్లాడారు. ఈ మీటింగ్ సక్సెస్ అయ్యింది. మీటింగ్ లో రిషి సునాక్ అదరగొట్టేశారు. తన నిజాయితీతో, తన వాక్ చాతుర్యంతో నారాయణ మూర్తిని ఇంప్రెస్ చేశారు. అక్షతను తనకిచ్చి పెళ్లి చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపించారు. నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్లి చేస్తే తడిగుడ్డ వేసుకుని నిద్రపోవచ్చు అన్న ధీమా కల్పించారు. ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చారు రిషి సునాక్.
దీంతో ఆయన వీరి ప్రేమకి వీసా, పాస్ పోర్ట్ ఇచ్చేశారు. కట్ చేస్తే ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైపోయారు. 2009 ఆగస్ట్ 30న బెంగళూరులో సాంప్రదాయ పద్ధతిలో రిషి, అక్షతల వివాహం జరిగింది. వేలాది కోట్లకు అధిపతి అయినప్పటికీ రిషి సునాక్ చాలా సింపుల్ గా ఈ పెళ్లిని కానిచ్చేశారు. పెద్దగా హంగూ, ఆర్భాటాలు చేయకుండా.. సింపుల్ దక్షిణాది వంటకాలతో అతిధులకు విందు ఏర్పాటు చేశారు. 500 మంది అతిధులు వీరి వివాహానికి హాజరయ్యారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 11 ఏళ్ల కృష్ణ సునాక్, 9 ఏళ్ల అనౌష్క సునాక్ ఉన్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారట.
ఇక రిషి భార్య అక్షత బ్రిటన్ లోని మొదటి 200 మంది ధనవంతుల్లో ఒకరు. ఫ్యాషన్ డిజైనింగ్ లో ట్రెండ్ సెట్ చేసిన అక్షత.. తన భర్త ప్రధాని రేసులో ఉన్నప్పుడు చాలా ప్రోత్సాహం అందించారు. అందుకే రిషి ప్రధానిగా ఎంపికైన తర్వాత భార్య పేరు ప్రస్తావించారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు. అలా మన రిషి సునాక్ విజయం వెనుక కూడా అక్షత ఉన్నారు. అలా వీరి ప్రేమ సినిమాని తలపించే విధంగా సాగింది. ఏది ఏమైనా భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ బ్రిటన్ దేశానికి ప్రధాని అవ్వడం గర్వపడే విషయమే.