రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే.. నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. చేయాల్సిన పనిల్లా సముద్రం తీరంలో ఉంటూ సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం వంటివి చేయాలి. ఆ పనినైనా సవాల్ గా స్వీకరించే వారికి ఇది చక్కటి ఉద్యోగం..
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు వేలకు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేస్తున్నాయి. ఏ రోజు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో నెలకు రూ. 4 లక్షలు జీతం వచ్చే ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదట. అలా అని ఇదేదో కష్టతరమైన ఉద్యోగమెమో లేదా ఒంటరిగా పనిచేయలేమో అన్న ఊహల్లోకి వెళ్ళకండి. ఇది కాస్త కష్టతరమైన ఉద్యోగం అయినప్పటికీ.. చేయగలిగిన పనే. ఇంతకీ ఈ ఉద్యోగం ఏంటి..? లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు ఆసక్తి చూపట్లేరు..? వంటి కారణాలు ఇప్పుడు చూద్దాం..
ఉద్యోగ ప్రదేశం.. స్కాట్లాండ్, అబెర్డీన్‌లోని నార్త్ సీ తీరం. పని.. ‘ఆఫ్‌షోర్ రిగ్గర్’. అంటే.. సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో రిగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉంటూ సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది. దీనికి కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవసరం అవుతుంది. అందులోనూ క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి పనిచేయాలి. రోజుకు పన్నెండుగంటలు పనిచేయాల్సి ఉంటుంది. గంటకు రూ. 3వేల చొప్పున రోజుకు రూ. 36వేలు.. నెలకు రూ. 4 లక్షల రుపాయల వరకూ వేతనం చెల్లిస్తారు. దీంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తారు. సెలవులు కూడా ఉంటాయి.
మరి ఎందుకు ఆసక్తి చూపట్లేరంటే.. ఒకసారి చమురు రిగ్‌లోకి వెళ్లిన తర్వాత.. 6 నెలల పాటు అక్కడే ఉండాలి. అంటే.. 6 నెలల పాటు డే షిఫ్ట్ చేశారనుకోండి.. బయటకు వచ్చి వెళ్ళాక మరో 6 నెలలు నైట్ షిఫ్టుల్లో పనిచేయాలి. ఇదొక్కటే ఆసక్తి చూపకపోవడానికి కారణం. మొత్తం 5 ఖాళీలున్నట్లు ఒక పేరు మోసిన కంపెనీ ప్రకటించింది. అయితే తన పేరు మాత్రం బయటికి వెల్లడించలేదు. కానీ ఎనర్జీ మార్కెట్‌లో చాలా పెద్ద కంపెనీ, పేరున్న కంపెనీ అని పేర్కొంది. అలాగే.. ఈ ఉద్యోగం కోసం ఆసక్తి చూపే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా వివరించింది. ప్రధానంగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. BOSIET (బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), FOET (ఫర్‌దర్ ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్), OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి.
10 వేల జీతానికే 12 గంటలు పనిచేస్తున్న రోజులివి. అందులోనూ చదివిన చదువుకు.. చేస్తున్న ఉద్యోగానికి పొంతన ఉండట్లేదు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి పైచదువులు చదివిన వారు కూడా డెలివరీ బాయ్ గా, వాచ్ మెన్ గా, ఆఫీస్ అసిస్టెంట్ గా.. వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగాలతో పోలిస్తే ‘ఆఫ్‌షోర్ రిగ్గర్’ పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా 20వేలు.. 25వేలు వేతనం కోసం విదేశాలకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు. కావున కష్టం అనుకోకుండా.. ఓ రెండేళ్ల పాటు ఇలాంటి ఉద్యోగాలు చేశారనుకో జీవితంలో స్థిరపడవచ్చు. కానీ, ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న ఉద్యోగాలు కనుక ఆలోంచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.