రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకే లాటరీ లాంటివి వేస్తుంటారు. అయితే ఇవి అందరికీ తగలవు. లాటరీ రావాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. చైనాలో ఓ వ్యక్తికి అదృష్టం వరించి లాటరీలో కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. డబ్బులు వచ్చాయని మురిసిపోయిన అతడికి భార్య షాక్ ఇచ్చింది.
కోటీశ్వరులు అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి! రాత్రికి రాత్రే కుప్పలు కుప్పలుగా డబ్బులు వచ్చిపడాలని కోరుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే ఇది అందరి విషయంలోనూ జరగదు. ఎంచుకున్న రంగంలో చెమటోడ్చి, శ్రమించి కొన్నేళ్లపాటు దీక్షగా పనిచేస్తే తప్ప ఉన్నతస్థాయికి చేరలేం. కానీ కొందరి విషయంలో మాత్రం ఇది మినహాయింపనే చెప్పాలి. రాత్రికి రాత్రే ధనవంతులు అయినవాళ్లు ఉన్నారు. జాక్‌పాట్ తగిలి కోటీశ్వరులైన వాళ్లూ ఉన్నారు. అయితే, హఠాత్తుగా వచ్చి పడే డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలియక పోగొట్టుకున్న వాళ్లూ ఉన్నారు.
దుర్వ్యసనాల మోజులో పడి కోట్లాది డబ్బును పోగొట్టుకున్న వారి గురించి కూడా విన్నాం. ఇకపోతే, అదృష్టం ఉంటే తప్ప రాత్రికి రాత్రే ధనవంతులు కాలేం. అలాంటి అదృష్టమే చైనాలోని ఓ వ్యక్తిని వరించింది. డ్రాగన్ కంట్రీలోని జోవ్ అనే వ్యక్తికి ఏకంగా రూ.12.13 కోట్ల లాటరీ తగిలింది. ట్యాక్స్ లాంటివి మినహాయించగా అతడి చేతికి ఆఖరుకు రూ.10.22 కోట్లు వచ్చాయి. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో ఎగిరి గంతేశాడు జోవ్. ఆ డబ్బును ఏం చేయాలో ఆలోచించసాగాడు. అయితే లాటరీ గెలుచుకున్న విషయాన్ని మాత్రం భార్యకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు.
ఈ డబ్బులో కొంత మొత్తాన్ని తన సోదరికి ఇచ్చాడు జోవ్. అంతేకాదు.. రూ.85 లక్షలు విత్ డ్రా చేసి తన మాజీ లవర్ కోసం మంచి ఫ్లాట్‌ను కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే కొన్నాళ్ల తర్వాత జోవ్ భార్య లిన్‌కు ఈ విషయాలు తెలిశాయి. లాటరీ ద్వారా ఇన్ని కోట్ల డబ్బు గెలుచుకున్నా తనకు చెప్పలేదని కోపంతో ఆమె రగిలిపోయింది. అలాగే సోదరికి, మాజీ ప్రేయసికి జోవ్ కొంత డబ్బు ఇచ్చాడని తెలిసి ఆమె మరింత ఆగ్రహానికి లోనైంది. తనకు భర్య అన్యాయం చేశాడని ఆరోపిస్తూ విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది లిన్.
లాటరీ డబ్బుతో పాటు మొత్తం ఆస్తిని తనకు సమానంగా పంచాలని న్యాయస్థానాన్ని లిన్ కోరింది. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. లాటరీ టికెట్‌ను ఇద్దరి డబ్బులతోనే కొన్నప్పటికీ.. జోవ్ రూ.12 కోట్లు గెలుచుకున్న విషయాన్ని తన భార్య దగ్గర దాచడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. జోవ్ తన సోదరి, ప్రియురాలి కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా లాటరీలో దక్కించుకున్నదేనని గుర్తించింది. దీంతో లాటరీ ద్వారా వచ్చిన డబ్బులో 60 శాతాన్ని భార్యకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మిగతా ఆస్తిని చెరి సమానంగా పంచాలని స్పష్టం చేసింది. మరి.. ఈ కేసులో కోట్లాది రూపాయలు గెలుచుకున్న విషయాన్ని భార్యకు చెప్పకుండా భర్త రహస్యంగా ఉంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.