అక్కడ స్థానికులు రోడ్డు దాటాలంటే పాస్ పోర్ట్ ఉండాలి. కిరాణా సరుకులు కొనాలన్నా సరే పాస్ పోర్ట్ ఉండాల్సిందే. సాధారణంగా వేరే దేశం వెళ్తేనే కదా పాస్ పోర్ట్ ఉండాలి. కానీ రోడ్డు దాటితే పాస్ పోర్ట్ దేనికి అని అనుకుంటున్నారా? అదే మ్యాజిక్కు. అక్కడ నిత్యావసర సరుకులు కొనాలన్నా.. ఇతర అవసరాలు తీరాలన్నా గానీ పాస్ పోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆ రోడ్డుని సరిహద్దుగా చేసుకుని రెండు దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో రోడ్డు అవతలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఉండాలి. లేదంటే అనుమతించరు. ఈ విచిత్రమైన పరిస్థితి అమెరికా, కెనడా దేశాల మధ్య ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఒక పెద్ద సరిహద్దు ఉంది. ఈ సరిహద్దుని ఆనుకుని వందల సంఖ్యలో రెండు దేశాల నగరాలు, గ్రామాలు ఉన్నాయి. వీరంతా పక్క దేశానికి రోడ్డు మార్గంలో వెళ్తూ ఉంటారు. అది కూడా పాస్ పోర్ట్ ఉంటేనే. లేదంటే జరిమానా విధిస్తారు, జైలు శిక్ష కూడా వేస్తారు.
ఒకే రోడ్డుని అమెరికా, కెనడా దేశాలు పంచుకుంటున్నాయి. అమెరికా ఉత్తర సరిహద్దు చాలా వరకూ కెనడా దేశంతో పంచుకుని ఉంటుంది. ఈ సరిహద్దు 9 వేల కిలోమీటర్ల పొడవు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దుగా పేరొందింది. ఈ రెండు దేశాల మధ్య వందకు పైనే సరిహద్దు క్రాసింగ్ లు ఉన్నాయి. వీటిలో అమెరికా రాష్ట్రమైనటువంటి వెర్మోంట్, కెనడా ప్రావిన్స్ లో ఉన్న క్యూబెక్ మధ్య 15 సరిహద్దు క్రాసింగ్ లు ఉన్నాయి. ఇక వీటిలో అమెరికాలో డెర్బైలైన్, కెనడాలో స్టాన్ స్టెడ్ పట్టణాల మధ్య ఉన్న సరిహద్దు చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఇది ప్రజలు ఇరు దేశాల నివసించే నివాస స్థలాలనే కాదు.. అరకిలోమీటరు వరకూ ఉన్న రోడ్డుని కూడా విభజిస్తుంది. దీన్ని కానుసా వీధి అని అంటారు.
ఈ వీధిలో అమెరికా, కెనడా ఇరు దేశాల వారు ఉంటారు. ఈ వీధిని దాటుకుంటూ ఇరు దేశాల వారు ఆ దేశాల్లో అడుగుపెడుతుంటారు. అమెరికాలో ఉన్న డెర్బైన్ పట్టణానికి కావాల్సిన తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి సౌకర్యాలు కెనడాలో ఉన్న స్టాన్ స్టెడ్ పట్టణం నుంచే అందుతాయి. ఈ రెండు పట్టణాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా.. ఇరు దేశాల సిబ్బంది వెళ్లి సహాయక చర్యలు చేపడతారు. అయితే సామాన్యులు మాత్రం పాస్ పోర్ట్ లేకుండా వెళ్ళడానికి లేదు. పెద్దలే కాదు, చిన్నారులు సైతం స్కూళ్లకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ చూపించి సరిహద్దులు దాటుకుని వెళ్లాల్సిందే. 9/11 ఎటాక్ తర్వాత అక్కడ భారీగా మార్పులు వచ్చాయి. అంతకు ముందు వరకూ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించారు. అయితే 9/11 ఎటాక్ తర్వాత భద్రత టైట్ చేశారు. ఇరు దేశాలు విధించిన ఆంక్షలతో బార్డర్ క్రాసింగ్ ఆఫీసుల్లో సంప్రదిస్తేనే అనుమతిస్తారు.
ఇరుగు పొరుగు ప్రజలని కలవాలన్న అనుమతి తీసుకోవాల్సిందే. చెక్ పోస్ట్ దగ్గర పాస్ పోర్ట్ చూపిస్తేనే రోడ్డు దాటే వీలు ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేవాళ్ళు వాహన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎవరేమంటారని రోడ్డు దాటితే.. భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అమెరికా 5 వేల డాలర్లు లేదా రెండేళ్ల జైలు శిక్ష విధిస్తుంది. కెనడా అయితే వేయి డాలర్ల జరిమానా విధిస్తుంది. రోడ్డే కదా దాటితే ఎవరేమంటారు అని ఓ వ్యక్తి 2015లో రోడ్డు దాటే ప్రయత్నం చేసి అరెస్ట్ అయ్యాడు. ఈ ప్రాంతంలో నివసించే స్థానికులకు ఇరు దేశాల పౌరసత్వం ఉంటుంది. ఈ కారణంగా ఇరు దేశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అదన్నమాట విషయం.. ఒకే రోడ్డు మీద రెండు దేశాలు ఉన్నాయి. కిరాణా సరుకులు కొనాలన్నా, ఇంకేమైనా అవసరాలు తీరాలన్నా రోడ్డు దాటి పొరుగు దేశం వెళ్లాల్సిందే. అందుకోసం పాస్ పోర్ట్ కంపల్సరీ. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.