జీవితంలో ఏదైన చేయాలనే తపన అందరిలోనూ ఉంటుంది. కానీ అనుకున్న పని చేసేందుకు ప్రేరణ లేకనో.. ప్రోత్సాహం అందకనో.. పరిస్థితులు అనుకూలించకనో వాటిని చేయకుండానే కాలం వెళ్లదీస్తుంటారు. మనం చేయాలనుకున్న పనితో మన జీవితంలో మంచి మార్పు వస్తుందని కచ్చితంగా తెలిసినా కూడా చేద్దాం, చూద్దాం అంటూ వాయిదా వేస్తూ వస్తుంటాం. కానీ ఒక బలమైన బంధం తోడుంటే, ప్రేమతో పాటు ప్రేరణ, ప్రోత్సాహం అందిస్తే మాత్రం కొందరు అద్భుతాలు చేస్తారు. ఈ రియల్ స్టోరీ కూడా అలాంటిదే. దాదాపు 220 కేజీల బరువున్న అమ్మాయి 100 కేజీలపైన బరువున్న అబ్బాయి స్నేహం, ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం, వారి దృఢ సంకల్పం గురించి తెలుసుకుంటే మాత్రం వావ్ అనకుండా ఉండలేం. లెక్సీ చాలా లావుగా ఉంటుంది.
చిన్నప్పటి నుంచి తన ఆహారపు అలవాట్ల కారణంగా ఆమె ఇలా అయింది. అధిక బరువుతో రోజు వారీ పనుల్లో చాలా ఇబ్బంది పడేది. బరువు తగ్గాలి అని చాలా సార్లు అనుకుంది కానీ, అందుకోసం ఏమీ చేయలేదు. తనకు 25 ఏళ్ల వయసులో డన్నీ అనే యువకుడు ప్రపోజ్ చేశాడు. లెక్సీ, డన్నీ 10 ఏళ్ల నుంచి స్నేహితులు. తన అధిక బరువును లెక్కచేయకుండా కేవలం తన మనసు మాత్రమే చూసి ఇష్టపడ్డ డన్నీ అంటే లెక్సీకి కూడా చాలా ఇష్టం. ఇలా స్నేహితులు కాస్తా ప్రేమికులుగా మారిన లెక్సీ, డన్నీ ఒక నాడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ఒక చిక్కు వచ్చి పడింది. లెక్సీకి సరిపోయే పెళ్లి డ్రెస్ దొరకలేదు. అందుకోసం ఇద్దరు చాలా దుకాణాలు తిరిగారు.
దాదాపు 485 పౌండ్ల బరువుండే లెక్సీకి పెళ్లి గౌను దొరకడం అంత సులువైన విషయం కాదు. ఎట్టకేలకు తనకు సరిపడ గౌను దొరకబుచ్చుకున్న లెక్సీ ఆనందంగా పెళ్లి చేసుకుంది. అనంతరం ఇద్దరు ఆనందంగా వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. ఏడాది కాలం గడిచిపోయింది. లెక్సీకి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ అధిక బరువు వల్ల తాను గర్భం దాలిస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం దాంతో ఇద్దరు ఆ ఆలోచన మానుకున్నారు. శారీరకంగా కలిసేందుకు కూడా వారి అధిక బరువులు ఇబ్బందిగా ఉండేవి. లెక్సీకి అందమైన ప్రదేశాలు సందర్శించడం అంటే చాలా ఇష్టం. వేరే సుదూర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను చూడాలంటే విమానం లో వెళ్లాలి. కానీ లెక్సీ ఉన్న లావుకు ఆమె విమానం సీటులో పట్టదు. ఈ కారణంతో ఆమె ఎక్కడికీ వెళ్లలేకపోయేది. ఈ విషయంలో భార్యభర్తలు ఇద్దరు బాధపడేవారు.
ఈ క్రమంలో ఒక న్యూ ఇయర్ సందర్భంగా లెక్సీ తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను మార్చేసింది. న్యూ ఇయర్ రివ్వల్యూషన్‌గా ఇప్పటి నుంచి జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు, కచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలి అనే నిబంధనను లెక్సీ పెట్టుకుంది. లెక్సీ నిర్ణయాన్ని భర్త డన్నీ అంగీకరించడంతో పాటు ఈ కఠిన ప్రయానానికి భార్యకు తోడుగా నిలిచాడు. ఆమెతో కలిసి వ్యాయామం చేయడం మొదలు పెట్టాడు. 18 నెలల కఠోర సాధన తర్వాత వారిద్దరి జీవితాల్లో అద్భుతమైన మార్పు సంభవించింది. ఇది నిజమా, నిజంగానే వీళ్లిద్దరూ లెక్సీ, డన్నీలేనా అనే రీతిలో వారి శరీరాకృతిలో మార్పు వచ్చింది.
ఒకప్పుడు లావుగా బండగా ఉన్న లెక్సీ ఇప్పుడు సన్ననీ మెరుపుతీగలా తయారైంది. రెండు ఏళ్ల కంటే ముందు వీరు దిగిన ఫోటోను, ఇప్పటి ఫోటోను పక్కన పక్కన పెడితే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. లెక్సీ, డన్నీ జీవితంలో వచ్చిన అసాధారణ మార్పుకు కారణం కచ్చితంగా వారి మధ్య ఉన్న ప్రేమ. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం ఒకరికి ఒకరు తోడు నిలిచేలా చేసింది. అధిక బరువు వారి జీవితంలో సమస్యగా మారితే దాన్ని వారి బలమైన బంధంతో అధిగమించారు. భర్తకు భార్య, భార్యకు భర్త తోడుంటే జీవితం చాలా అందంగా ఉంటుంది అనేందుకు చక్కటి ఉదాహరణ ఈ స్టోరీ. మరి లెక్సీ, డన్నీ ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.