సోషల్ మీడియాలో చూసిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మి ప్రయోగాల్లో పెట్టి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతి విషయం యూట్యూబ్‌లో మాదిరి బయట చేయలేం. ఈ విషయం చాలామందికి తెలియదు. ఓ వ్యక్తి ఏకంగా తలకు రంధ్రం చేసి ప్రయోగంతో ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూస్తూ వైద్యం చేయడం, డెలివరీలు చేయడం, సొంత ప్రయోగాలు చేయడం చూస్తున్నాం. అలా చేసి ఆస్పత్రి పాలైనవారు చాలామందే ఉన్నారు. కొందరైతే ప్రాణాలమీదికి తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. యూట్యూబ్ చూస్తూ డెలివరీ చేస్తే వికటించి మహిళ చనిపోయింది. తాజాగా ఓ వ్యక్తి తనకు వచ్చే కలలను నియంత్రించేందుకు తలలో ఒక చిప్ పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఏకంగా తన తలకు తానే డ్రిల్ మిషన్‌తో రంధ్రం చేసుకున్నాడు. మెదడుకు దగ్గరగా చిప్ అమర్చాడు. దీంతో చావు దరిదాపులకు వెళ్లి బతికి వచ్చాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో.. ఏం చేశాడో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఇప్పటి జనం ప్రతి విషయం సోషల్ మీడియాలో చూసి అనుకరిస్తున్నారు. అలా ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మి చావును కొనితెచ్చుకున్న వారిని, ఆస్పత్రి పాలైన వారిని చాలామందిని చూశాం. అయితే ఇటీవల రష్యాకు చెందిన 40 ఏళ్ల మిఖాయిల్ రాదుగా అనే వ్యక్తి తను నిద్రపోయినప్పుడు వచ్చే కలలను నియంత్రించేందుకు తలలో ఓ చిప్‌ను సెట్ చేయాలనుకున్నాడు. దాని కోసం ఇంటర్నెట్ లో సమాచారం సేకరించి.. ఒక ఎలక్ట్రోడ్ చిప్‌ను తీసుకున్నాడు. వీడియో చూస్తూ.. డ్రిల్ మిషన్‌తో తలకు రంధ్రం చేసి చిప్ అమర్చేందుకు ప్రయత్నించాడు. నేరుగా కపాలానికి రంధ్రం చేశాడు. మెదడుకు దగ్గరలో చిప్ అమర్చాడు. దీనికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. తల నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి అతనిని ఆస్పత్రికి తరలించారు.
సరైన సమయానికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. మొదట్లో న్యూరో సర్జన్లను చిప్ పెట్టేందుకు సంప్రదించాడు. కానీ చట్టరిత్యా నేరమని వారు అతనిని వారించారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మిఖాయిల్ రాదుగా ట్విట్టర్ లో దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేయడం గమనించదగ్గ విషయం. తన మెదడు పక్కనే ఒక ఎలక్ట్రోడ్ చిప్‌ను అమర్చినట్లు అతను తెలిపాడు. దానితో నిద్రలో కలలు వచ్చినప్పుడు మెదడు కదలికలు, వాటిని పరీక్షించుటకు యూజ్ అవుతుందని వెల్లడించాడు. ఈ ప్రయోగం ఇదే మొట్టమొదటిది అని వివరించాడు. అందుకే వీడియోలు చూసి సేకరించిన సమాచారం ప్రకారం తానే ప్రయోగాన్ని చేసుకున్నట్లు తెలిపాడు.