గూగుల్ అంటే పెద్ద కంపెనీ. ఆ సంస్థలో జాబ్ పోతే జీవితం పోయినట్టే ఫీలవుతారు. అలాంటిది ఒక ఉద్యోగి ఏకంగా ఒక కంపెనీయే పెట్టాలని అనుకున్నాడు. అంతేనా ఉద్యోగం కోల్పోయిన తోటి ఉద్యోగులకు అందులో జాబ్ కూడా ఇవ్వనున్నాడు.
ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలన్నీ జీతాలివ్వలేక ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. గూగుల్ సైతం భారీగా ఉద్యోగులను తొలగించింది. గూగుల్ సంస్థ ఇటీవల 12 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఉద్యోగం పోయిందని అతను నిరాశ చెందలేదు. తనలానే ఉద్యోగం కోల్పోయిన వారికి జాబ్ ఇచ్చేలా కొత్త కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. నోటిఫికేషన్ గడువు పూర్తయ్యేలోపు కొత్త కంపెనీ ఏర్పాటు చేసి జాబ్ లెస్ గయ్స్ అందరినీ తన కంపెనీలోకి లాగేయాలని చూస్తున్నాడు. ఎవరా ఆపద్భాంధవుడు అని అనుకుంటున్నారా? అతనే హెన్రీ కిర్క్.
గూగుల్ సంస్థలో 8 ఏళ్ల పాటు సీనియర్ మేనేజర్ హోదాలో పని చేశాడు. గూగుల్ లేఆఫ్స్ లో ఉద్యోగం కోల్పోయిన ఇతను ప్రస్తుతం నోటీస్ పీరియడ్ లో ఉన్నాడు. నోటీస్ పీరియడ్ గడువు పూర్తయితే కంపెనీ వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే అందరిలా తాను కూడా కొత్త జాబు వెతుక్కోవడం అవసరమా అనుకుని.. కొత్త కంపెనీ పెట్టేస్తే పోలే అని అనుకున్నాడు. తన ఆలోచన తోటి ఉద్యోగులకు చెప్పగా వాళ్ళు శభాష్ అని మద్దతు ఇచ్చారు. హెన్రీ కిర్క్ కి మరో ఆరుగురు గూగుల్ ఉద్యోగులు తోడయ్యారు. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్, డెవలప్మెంట్ స్టూడియోను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి హెన్రీ లింక్డిన్ లో పోస్ట్ పెట్టాడు.
మార్చిలో తన లేఆఫ్ నోటిఫికేషన్ పీరియడ్ పూర్తి కానుందని, ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉందని.. ఈలోపు తన టీంతో కలిసి కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తానని వెల్లడించాడు. తన కంపెనీ ద్వారా డిజైన్, రీసెర్చ్ టూల్స్ అందించనున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు యూజర్ల మద్దతు కావాలని కోరాడు. ఈ పోస్ట్ కి నెటిజన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి పని చేస్తున్నారు, మీరు సక్సెస్ అవ్వాలి అని కామెంట్స్ పెడుతున్నారు. మరి గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలో ఉద్యోగం పోయిందని బాధపడడం మానేసి.. కంపెనీ పెట్టాలనుకున్న హెన్రీ కిర్క్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.