ఈ భూమ్మీద సూర్యశక్తితోనే జీవరాశుల మనుగడ జరుగుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే సూర్యశక్తిని భూమ్మీద ఉత్పత్తి చేసేందుకు చైనా కొన్నాళ్ల కిందటే పరిశోధన చేపట్టిన విషయం తెలిసిందే. చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టొకమాక్(EAST) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.
సూర్యుడిలో శక్తి ఉత్పత్తి చెందే ప్రక్రియను అనుకరించే ఈ EAST రియాక్టర్.. తాజాగా 1056 సెకెన్ల పాటు(అంటే 17 నిమిషాలకుపైగా) ప్రజ్వలించి సుమారు 7కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసింది. సూర్యుడి ఉష్ణోగ్రత శక్తి 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ కాగా ఈస్ట్ 7కోట్ల డిగ్రీల సెల్సియస్ నమోదు చేసింది. కాబట్టి సూర్యుడి కంటే ఈస్ట్ దాదాపు 5 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసిందని ఈ ప్రయోగానికి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్త గాంగ్ జియాన్జు తెలిపారు.ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్ లలో ఇదే అత్యంత సుదీర్ఘమైందని ఆయన చెప్పారు. గతంలో 2003లో ఫ్రాన్స్ కి చెందిన టోరే సుప్రా టొకామా 390 సెకెన్ల పాటు వెలిగి ఇదే స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేసింది. అయితే.. ఆ రికార్డును తాజాగా చైనా బ్రేక్ చేయడం విశేషం. గతేడాది మే నెలలోనూ ఈస్ట్‌తో(101 సెకెన్లు పాటు మండించగా) 120 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేశారని సమాచారం.
ఇలా డ్యుటేరియం ఉపయోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను అనుకరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పన్నం చేయడమే ఈస్ట్ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యూజన్ ఎనర్జీ మిషన్ చైనా హీఫీలోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఉంది. భవిష్యత్తులో ఈస్ట్ సాయంతో మరింత శక్తిని ఉత్పన్నం చేసి దేశానికి అందించాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. 2006లో ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పరిమెంటల్ రియాక్టర్ (ITER) కార్యక్రమంలో భాగంగా తొలిసారి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ITER ప్రాజెక్ట్‌లో సౌత్ కొరియా, జపాన్, రష్యా, అమెరికా వంటి దేశాలతో భారత్ కూడా భాగస్వామ్యమైన సంగతి తెలిసిందే. మరి ఈ చైనా కృత్రిమ సూర్యుడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.