ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రపంచాన్ని వేపుకు తినేస్తుంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేసి విన్నూత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్ళు కడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువగా పేరుకుపోయేది వాటర్ బాటిల్సే. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల వాటర్ బాటిల్స్ పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ ని సేకరించి.. వాటితో అందమైన భవనాన్ని నిర్మించారు. అలా అని ఈ భవనం ఏమీ అల్లా టప్పాగా కట్టింది కాదండోయ్. తుఫాను వచ్చినా సరే చెక్కు చెదరకుండా ఉండడం దీని ప్రత్యేకత.
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ భవనం తైవాన్ రాజధాని తైపీ నగరంలో నిర్మించబడింది. ఎకో ఆర్క్ పేరుతో నిర్మించిన ఈ భవనం యొక్క ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్ చేసిన వాటర్ బాటిల్స్ తో నిర్మించబడింది. దీని కోసం 15 లక్షల వాటర్ బాటిల్స్ ను వాడారు. అయితే ఈ ప్లాస్టిక్ బాటిళ్లను నేరుగా వినియోగించకుండా.. వాటిని కరిగించి.. మళ్ళీ కొత్త బాటిల్స్ గా చేసి నిర్మాణంలో ఉపయోగించారు. ఈ బాటిల్స్ అన్నిటినీ ఒకే సైజులో, ఒకే ఆకృతిలో తయారు చేశారు. వీటన్నిటినీ ఉక్కు ఫ్రేములో ఒకదానికొకటి జోడించి.. చతురస్రాకార ప్యానెల్స్ లో అసెంబుల్ చేసి పటిష్టంగా బిల్డింగ్ ముందు భాగాన్ని నిర్మించారు. మిగిలిన భాగాన్ని రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించారు.
ప్లాస్టిక్ బాటిల్స్ పారదర్శకంగా ఉండడం వల్ల పగటి పూట లైట్లు వేసుకునే అవసరం ఉండదు. రాత్రిపూట లైటింగ్ కోసం 40 వేల ఎల్ఈడీ బల్బులను అమర్చారు. దీనికి కావాల్సిన విద్యుత్ ని పూర్తిగా సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా తీసుకునేలా ఏర్పాటు చేశారు. కాంక్రీట్ తో చేసిన భవనంతో పోల్చుకుంటే.. ఈ ఎకో ఆర్క్ బిల్డింగ్ సగానికి కంటే తక్కువగా ఉంటుంది. తేలిగ్గా ఉంది కదా అని గట్టిగా తుఫాను వస్తే కొట్టుకుపోతుందనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది తుఫానులు వచ్చినప్పుడు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా.. ఫైర్ ప్రూఫ్ కెమికల్ కోటింగ్ వేశారు.
దీన్ని ఆర్థర్ హువాంగ్ అనే డిజైనర్ డిజైన్ చేశాడు. తైవాన్ లో ఏటా 45 లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ ని చెత్తలో పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని మరలా ఉపయోగించవచ్చునన్న ఉద్దేశంతో ఎంతో శ్రమించి.. పట్టుదలతో ఎకో ఆర్క్ బిల్డింగుని డిజైన్ చేశాడు. దీని కోసం దాదాపు 25 కోట్లు ఖర్చు అయ్యింది. మరి 15 లక్షల వాటర్ బాటిల్స్ ని ఉపయోగించి భవంతిని కట్టిన వ్యక్తిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. తైవాన్ కి చెందిన ఇతను 25 కోట్లు ఖర్చు పెట్టి భవనాన్ని కడితే.. మన దేశానికి చెందిన అమ్మాయిలు చాలా తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టేశారు. ఇదే ప్లాస్టిక్ బాటిల్స్ ని యధావిధిగా ఉపయోగించి మరీ ఇల్లు కట్టేశారు.