ప్రతీ చిన్న సమస్యకు కృంగిపోయే జీవతాలు ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు. సమస్యను కూడా సంతోషంగా స్వీకరించగలిగితేనే అంతా బాగుంటుంది. లేదంటే జీవితం దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా మారుతుంది.
విధి ఎప్పుడు ఎవరి జీవితంతో ఎలా ఆడుకుంటుందో ఎవ్వరమూ చెప్పలేము. కొన్ని సార్లు మన ఊహలకందని విషాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని విషాదాలు.. పూడ్చలేని లోటుగా.. మాయని గాయన్ని మిగిల్చిపోతుంటాయి. శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఏం జరిగినా.. మానసికంగా.. శారీరకంగా ఎలాంటి లోటు ఏర్పడినా గుండె నిబ్బరంతో ఉండాలి. ఇదే బతుకు నేర్పే ఉన్నతమైన పాఠం. ఈ పాఠాన్ని ఒంట బట్టించుకున్న వారు జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా నవ్వుతూ ముందుకు వెళ్లిపోతారు. లేదంటే.. దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా నిత్యం నరకం అనుభవించాల్సి వస్తుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తమ జీవితంలో జరిగిన చిన్న చిన్న విషాదాల్ని కొందరు నిత్యం తల్చుకుని కృంగిపోతుంటారు. కానీ, కొంతమంది కష్టంలోనూ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అచ్చం ఇంగ్లాండ్‌కు చెందిన ఇబ్రహింలాగా.. అతడి జీవితంలో 14 ఏళ్లకే అవిటితనం రూపంలో ఓ పెద్ద లోపం వచ్చి పడింది. వైద్యులు అతడి కాలును కోసి వెనక్కు తిప్పి కుట్టారు. అతడు మాత్రం చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉన్న తన కాలుతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. విషాదంలోనూ సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. ఇంతకీ సంతగతేంటంటే..
అది 2015.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన ఇబ్రహిం అబ్దుల్‌అరఫ్‌కు అప్పుడు 14 ఏళ్లు. అతడు ఓ రోజు తన సోదరుడితో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతడి కాలుకు గాయం అయింది. కాలికి అయిన గాయం బాగా నొప్పి తీస్తూ ఉంది. ఆ నొప్పి మరుసటి రోజుకు తగ్గుతుందని అతడు అనుకున్నాడు. అయితే, ఆ నొప్పి మరుసటి మరింత పెరిగింది. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇబ్రహింను పరీక్షించిన వైద్యులు కాలికి బోన్ క్యాన్సర్ సోకినట్లు తేల్చారు. కాలును తీసేయాలని చెప్పారు. కాలు తీసేయటం నచ్చని ఇబ్రహిం కుటుంబసభ్యులు కీమోథెరపీ చేయించటానికి సిద్ధపడ్డారు.
అయితే, కీమో కారణంగా క్యాన్సర్ తగ్గలేదు సరికదా.. ఇంకా పెరిగింది. దీంతో డాక్టర్లు రొటేషన్ ప్లాస్టీ చేయించుకోవాలన్నారు. ఈ రొటేషన్ ప్లాస్టీలో భాగంగా డాక్టర్లు అతడి కాలును కోశారు. తొడ, మోకాలి మధ్య భాగాన్ని తొలగించారు. మిగిలిన కాలిని వెనక్కు పెట్టి తొడ భాగానికి అతికించారు. ఇలా చేయటం ద్వారా నడవటం ఈజీ అవుతుందని వైద్యులు చెప్పారు. కొన్ని నెలలు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఇబ్రహిం కోలుకున్నాడు. మొదట్లో తన కాలును చూసి భయపడ్డాడు.. బాధపడ్డాడు. తర్వాత అది అలవాటైంది. ఇప్పుడు కాలికి ఆసరా సాయంతో చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఆటలు కూడా ఆడగలుగుతున్నాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.