ఓవైపు దాయాది పాకిస్తాన్, మరో వైపు డ్రాగన్ చైనాలు మన దేశంపై దాడి చేసేందుకు నిత్యం కాలు దువ్వుతూనే ఉంటాయి. భారత్ కూడా వీటికి ధీటుగా బదులిస్తుంటుంది. ఈ రెండు దేశాల ఆగడాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో అద్భుత అస్త్రం చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన స్వల్ప-శ్రేణి, భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించగల గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని బాలాసోర్ కేంద్రం నుంచి మిస్సైల్ పరీక్షను నిర్వహించారు. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి చేధిస్తుందని డీఆర్‌డీవో తెలిపింది.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 500-1,000 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఘన-ఇంధన, యుద్ధభూమి క్షిపణి భారతీయ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది.
#WATCH ‘Pralay’ surface to surface ballistic missile successfully testfired
(Source: DRDO) pic.twitter.com/MjW9lYR1Cm
— ANI (@ANI) December 22, 2021
బుధవారం ఉదయం 10.30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ నుంచి ప్రళయ్ క్షిపణిని ప్రయోగించారు. ట్రాకింగ్ సాధనాల బ్యాటరీ తీర రేఖ వెంబడి దాని రూట్‌ని పర్యవేక్షించారు. ప్రళయ్ అనేది ఒక పాక్షిక బాలిస్టిక్ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల క్షిపణి. ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఓడించే విధంగా అధునాతన క్షిపణిని అభివృద్ధి చేశారు. ఇది ఒక నిర్దిష్ట శ్రేణి చేరిన తర్వాత గాలిలో మధ్యలోనే దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది’’ అని డీఆర్‌డీఓ అధికాఉలు తెలిపారు.
ఈ తొలి డెవలప్‌మెంట్ ఫ్లైట్ ట్రయల్ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓ దాని అనుబంధ బృందాలను అభినందించారు. ఈ ఆయుధ వ్యవస్థ ఇండక్షన్ సాయుధ దళాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.