తొలకరి జల్లులకు భూమిలోని వజ్రాలు బయటకు వస్తాయి. ఇది నిజం. ఎక్కడో కాదు – రాయలసీమలో. ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని పొలాల్లోని వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి. అవి దొరికితే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. దీంతో ప్రతీయేటా ఆ తొలకరిరాగానే వజ్రాల కోసం వేట ప్రారంభిస్తారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కర్నూల్ జిల్లాలో ఓ మహిళ అనుకోకుండా లక్షాధికారిగా మారింది.
కుర్నాల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పగిడిరాయి గ్రామాల సరిహద్దు ప్రాంతంలో వేరుశనగ పొలం లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళా కూలీకి 7 క్యారెట్ల వజ్రం చిక్కింది. ఆ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారి రూ. 11 లక్షలకి కొనుగోలు చేసాడు. అలాగే మరో రెండు తులాల బంగారం కూడా ఇచ్చాడు. దీనితో కూలీ పనుల కోసం వెళ్లి లక్షాధికారిగా మారడం తో ఆ మహిళ పట్టరాని ఆనందంలో మునిగిపోయింది.
ఆ వ్యాపారికి అమ్మిన వజ్రం విలువ దాదాపుగా రూ. 1 కోటి వరకు ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కూలిపనులు చేసుకునే మహిళకు వజ్రం దొరికిందనే విషయం బయటకు తెలియడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ అయ్యింది.