ఇల్లు ఊడుస్తూ, అంట్లు తోముతూ, వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ ఇలా అన్ని పనులూ చేసి పెట్టే పని మనుషులు ధనవంతుల ఇళ్లలో ఉండడం అనేది మామూలే. చాలా మంది తమ ఇళ్లలో పనిచేసే పనిమనిషిని పనిమనిషిగానే చూస్తారు. కానీ వారి పని విలువ తెలిసిన కొందరు మాత్రం పని తెలిసిన మనిషిగా చూస్తారు. అలా చూసినప్పుడు ఆమెను తమ మనిషిగా గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడు తమ ఇంట్లో సభ్యులని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో.. అదే విధంగా పనిమనిషిని ట్రీట్ చేస్తారు. ఇలాంటివి చిన్నపిల్లల కార్టూన్ కథల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. నిజ జీవితంలో జరిగే అవకాశం లేదని అనుకుంటున్నారా? అయితే మీరు బర్త్ డే కేక్ లో కాళ్ళూ, చేతులు పెట్టినట్టే. అవును నిజ జీవితంలో కూడా పనిమనిషిని తమ మనిషిగా చూసే మంచి మనుషులు ఉంటారు.
సరిగ్గా నెల రోజుల క్రితం.. తన దగ్గర పని చేసే కూలీలను ప్రత్యేకంగా విమానంలో తిరుపతి తీసుకెళ్లి మరీ దర్శనం చేయించిన యజమాని గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. కూలీలకు విలువ ఇచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనభాగ్యం కల్పించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఓ కుటుంబం తన దగ్గర పనిచేసే పనిమనిషిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. పనిమనిషి పుట్టినరోజు సందర్భంగా ఒక యజమాని కుటుంబం ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె చేత కేక్ కట్ చేయించి గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని మిగిల్చారు. అంతేకాదు యజమానురాలు ఆమె కోసం స్వయంగా టీ పెట్టి మరీ తీసుకొచ్చి ఇచ్చింది.
ఇక యజమానురాలు కూతురు పనిమనిషికి కేక్ తినిపించి గట్టిగా కౌగలించుకుని తనపై ఉన్న ప్రేమను చాటింది. తన పుట్టినరోజుని తన కుటుంబ సభ్యుల్లా జరిపినందుకు ఆ పనిమనిషి భావోద్వేగానికి లోనైంది. ఎప్పుడూ, ఎవరూ తన పుట్టినరోజుని నిర్వహించలేదని ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనిమనిషికి ఇలా పుట్టినరోజు చేయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మిగతా యజమానులు కూడా పనిమనుషులకు విలువ, గౌరవం ఇస్తే ఎంతో బాగుంటుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఏ ఊళ్ళో జరిగిందో తెలియదు గానీ.. ఆమె (పనిమనిషి) తన భర్తతో కలిసి నగరంలో ఉంటుందని, తమ కుటుంబం కోసం ఆమె ఎంతో కష్టపడుతుందని, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నామని, అందుకే ఇలా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చామని, మేమంతా కలిసి మా ఇంట్లో వేడుకలా ఆమె పుట్టినరోజు నిర్వహించామని యజమాని కుటుంబం తెలిపింది. అంతేకాదు ‘కొన్నిసార్లు ఇతరుల ముఖంలో నవ్వు తెప్పించేందుకు మనం చేసే చిన్న చిన్న పనులే అయినా అవి ఎప్పటికీ మనతో పాటు జీవితాంతం గుర్తుగా ఉండిపోతాయి. హ్యాపీయెస్ట్ బర్త్ డే మౌషి. మా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు. మీరు లేకుండా మేము లేము’ అంటూ సదరు యజమాని కుటుంబం తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
నిజమే పనిమనిషి లేకపోతే ఇల్లు శుభ్రంగా ఉండదు. అయితే ఈ మౌషి అనే పనిమనిషి మాత్రం ఇంటినే కాదు, యజమాని కుటుంబాన్ని కూడా తన మంచి నడవడిక, వ్యక్తిత్వం, స్వభావంతో మానవత్వం పరిమళించేలా శుభ్రం చేసింది. దటీజ్ పనిమనిషి, పని తెలిసిన మనిషి మౌషి. యజమానులూ మీరు కూడా ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో సజీవంగా ఉండాలంటే.. మీ పనిమనిషికి గౌరవం ఇవ్వండి.