కొంత మంది బయట వారిని విశ్వసిస్తూ ఉంటారు. బయట వ్యక్తులతో చొరవ పెంచుకుని, వాళ్లను ఇంట్లోకి రానివ్వడం ద్వారా అణుఅణువునా మనల్ని పసిగట్టేలా వారికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. దీంతో అండ, ఆసరా లేని సమయంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు.
ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి దాపురించింది. అయినా వాళ్లు, నమ్మినోళ్లు నట్టేట ముంచుతున్నారని.. కొంత మంది బయట వారిని విశ్వసిస్తూ ఉంటారు. బయట వ్యక్తులతో చొరవ పెంచుకుని, వాళ్లను ఇంట్లోకి రానివ్వడం ద్వారా అణుఅణువునా మనల్ని పసిగట్టేలా వారికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. దీంతో అండ, ఆసరా లేని సమయంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. చేతి వాటం ప్రదర్శిస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు. నిన్న హయత్ నగర్ పరిధిలోని తొర్రూరులో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇటువంటిదే. ఈ కేసును 24 గంటల్లోనే చేధించారు పోలీసులు.
ఇంతకు ఏం జరిగిందంటే.. తొర్రూరుకు చెందిన సంరెడ్డి సత్తెమ్మ, స్వామి రెడ్డి భార్యా భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సత్తెమ్మ భర్త స్వామి రెడ్డి కొన్నేళ్ల క్రితం మరణించారు. ఇక పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆమె సొంతూరులో ఒంటరిగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమె ఇళ్లు ఖాళీగా ఉండటంతో.. మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన లలిత అనే మహిళకు తన ఇంట్లోనే ఓ గది అద్దెకు ఇచ్చింది. ఆమె కూలీ పనులు చేసుకుని బతికేది. ఈ క్రమంలో తన పెద్ద కుమారుడు బాల్ రెడ్డి వియ్యంకుడు, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుమార్తె వివాహం శంషాబాద్‌లో జరగ్గా.. ఆ శుభకార్యానికి సత్తెమ్మ హాజరైంది. ఆ రాత్రి పెద్ద కుమార్తె ఇంట్లో ఉండి.. మరుసటి రోజు ఆదివారం ఊరుకు వచ్చేసింది.
అయితే మరుసటి రోజు సత్తెమ్మ ఇంటికి వచ్చిన ఒకరు.. తలుపులు కొట్టగా.. ఆమె స్పందించలేదు. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో మరో తలుపు నుండి వెళ్లి చూడగా.. మంచంపై కదలకుండా పడి ఉంది. ఒంటిపై రక్తపు మరకలున్నాయి. వెంటనే కుమారుడు బాల్ రెడ్డికి సమాచారం అందించడంతో వచ్చి చూడగా.. ఒంటిపై నగలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగి.. నిందితులను పట్టుకున్నారు. డబ్బు, నగదు కోసం.. ఓ వ్యక్తి మోజులో పడ్డ సత్తెమ్మ ఇంట్లో అద్దెకుంటున్న లలిత.. అతడి సాయంతో ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కూలీ పనులు చేసుకుని లలితకు..నారాయణ్‌పేట జిల్లా దామరగిద్దకు చెందినఎండ్ల రాకేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని అన్న తొర్రూరులో ఇల్లు నిర్మిస్తుండటంతో పనులు చూసేందుకు వచ్చే క్రమంలో లలిత పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. సత్తెమ్మకు కూడా అతడిని పరిచయం చేసింది. అయితే సత్తెమ్మ గురించి మొత్తం తెలిసిన లలిత.. ఆమె దగ్గర నగలు ఉన్నట్లు తెలిసి.. వాటిని తీసుకుని ఉడాయించాలని అనుకుంది. తన ప్రాణాళికను రాకేష్‌కు చెప్పింది. అందులో భాగంగానే ఆదివారం రాత్రి వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డ లలిత, రాకేష్ ఆమెను హత్య చేశారు. లలిత ఆమె కాళ్లు పట్టుకోగా.. రాకేష్ సత్తెమ్మ గొంతు నులిమి చంపేశాడు. ఏమీ ఎరగనట్లు జనాల్లోనే తిరిగారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 23 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.