హైదరాబాద్- అసెంబ్లీలో తన భార్య నారా భవనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోజులు గడిచిన కొద్ది చంద్రబాబు నార్మల్ అవుతున్నారు. ఆ ఘటన తరువాత తన కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు చాలా ఉల్లాసంగా గడిపారు.
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవరాలి వివాహం హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో జరిగినఎన్టీఆర్ మనవరాలి పెళ్లికి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వదించారు. చంద్రబాబు అందరిని పలకరిస్తూ చాలా ఉల్లాసంగా గడిపారు.
ఈ పెళ్లికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే పలు రాజకీయ పార్టీ నేతలు విచ్చేసి వధూ వరులను ఆశీర్వదించారు. మొన్న జరిగిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి కుమార్తెను పెళ్లికూతురిని చేసిన సందర్బంగా కూడా చంద్రబాబు దంపతులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.
రాజకీయ విభేధాలతో చాలాకాలంగా దూరంగా ఉన్న తొడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నందమూరి కుటుంబంలో చాలా కాలం తరువాత జరుగుతున్న శుభకార్యం కావడంతో చంద్రబాబు ఎక్కువ సమయం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయన చాలా సంతోషంగా గడుపుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.