పిల్లలకు మంచి బుద్ధులు నేర్పి.. వారిని సరైన బాటలో నడిపించాల్సిన తండ్రే.. పెడతోవ పట్టాడు. ఇది మంచి పద్దతి కాదు.. తీరు మార్చుకోమని తండ్రికి సూచించాడు కుమారుడు. దాంతో ఆవేశం పట్టలేకపోయిన తండ్రి.. కన్న కొడుకనే బంధాన్ని కూడా మరిచి.. కుమారుడిని సజీవ దహనం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు…
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇతనికి హుసేన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన హుస్సేన్ కు తండ్రి అంటే ప్రాణం. ఐతే బాషా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన హుస్సేన్.. తప్పుచేస్తున్నావంటూ తండ్రిని మందలించాడు. అయినా తండ్రిలో ఎలాంటి మార్పు రాలేదు. తన మాట వినలేదని బంధువులతో తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. ఎన్ని చెప్పిన నాన్న మహబూబ్ భాషలో మార్పులు రావడం లేదని తన బాధను చెప్పుకున్నాడు.
ఐతే తన వివాహేతర సంబంధం గురించి కొడుకు బంధువులతో చెప్పుకొని బాధపడిన సంగతి మహబూబ్ బాషా చెవిలో పడింది. దీంతో కొడుకుపై కోపంతో ఊగిపోయాడు బాషా. దీని గురించి కొడుకుతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే కొడుకుపై ఆవేశంతో ఊగిపోతున్న బాషా.. హుస్సేన్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
కొడుకు మంటల్లో కాలిపోతుంటే తండ్రి మాత్రం నవ్వుతూ ఆనందించాడు. హుస్సేన్ కేకలు వేస్తూనే తండ్రిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతడికి స్వల్పగాయాలయ్యాయి. మరోవైపు హుస్సేన్ మాత్రం పూర్తిగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.