కరోనా టీకా కోసం వెళ్తే ఓచోట మొదటి డోసు కొవాగ్జిన్ మరో డోసు కొవిషీల్డ్ వేశారు. మరోచోట ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు. ఇంకోచోట ఏకంగా ఎంపీకే నకిలీ టీకా అందించారు. నల్గొండ జిల్లాలో కొవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల – పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు నిన్న ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. విషయం తెలియని ప్రమీల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది.
కొవిడ్ టీకా ఇవ్వాలంటూ టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా తనకు అంతకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని ప్రశ్నిస్తే నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పింది.మరోవైపు ప్రమీల చేసిన పొరపాటే ఇందుకు కారణమని వైద్య సిబ్బంది అంటున్నారు. పీహెచ్‌సీలో సాధారణ టీకాలు,దాని పక్కనే ఉన్న ఆయుష్ భవన్‌లో కరోనా టీకాలు ఇస్తున్నామని చెప్పారు.
ప్రమీల కోవిడ్ బ్లాక్‌లోకి కాకుండా పీహెచ్‌సీలోని రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారని తెలిపారు. దీంతో నర్సు ఆమె రేబిస్ టీకా కోసం వచ్చిందని భావించి ఆ టీకా ఇచ్చారని చెప్పారు. అయితే ఆ టీకా వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.