అమ్మాయిలకు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగే భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకోవాల్సిందే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు.
‘చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా.. చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా’అని ఓ గేయ రచయిత అన్నట్లు విద్య తెలివితేటలు, సంస్కారాన్ని నేర్పడమే కాదు. ఉపాధి కూడా కల్పిస్తుంది. భవితవ్యానికి బంగారు బాటలు వేస్తుంది. అయితే చదువుకోవాలని ఆశ ఉన్నా.. తల్లిదండ్రులకు చదివించే ఆర్థిక స్థోమత లేక అనేక మంది ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగో భర్తను, అత్తమామలను, పిల్లలను వండిపెట్టుకోవడమే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు. కానీ ఆ మహిళ మాత్రం.. పెళ్లైంది కదా అని ఊరుకోలేదు. కూలీపనులు చేసుకుంటూనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.
ఓ దినకరి కూలీ పిహెచ్‌డీ సాధించిన ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలో చోటుచేసుకుంది. ఆమె పేరు సాకే భారతి. ఆమె పిహెచ్‌డీ సాధించిందని తెలిసి ఊరంతా సంబరపడింది. నాగుల గుడ్డం అనే మారుమూల ప్రాంతానికి చెందిన భారతి కుటుంబం ఓ చిన్న రేకుల షెడ్డులో నివసిస్తోంది. చదువుకుని, ఉన్నతంగా బతకాలని ఆశించింది భారతి. అయితే ఆమె ఆశలకు గండికొట్టారు తల్లిదండ్రులు. భారతికి చిన్నప్పటి నుండి చదువుకోవాలని ఆశ. ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిలు. అందులో భారతి ఇంటికి పెద్దది. పదో తరగతి వరకు శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదువుకుంది. అయితే పెద్దది కావడంతో, వెనుక ఇద్దరు ఆడపిల్లలు పోషణ కూడా కష్టం కావడంతో.. మేనమామ శివ ప్రసాద్‌కిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు.
తాను చదువుకోవాలన్న విషయాన్ని భర్తను చెప్పడంతో అతడు ప్రోత్సహించాడు. కూలీ పనులకు వెళుతూనే అనంతరపురలోని ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేక.. తన ఊరి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఈ సమయంలో వారికో కూతురు గాయత్రి పుట్టింది. పొద్దునే పనులకు పోయి.. సాయంత్రం ఇంటికి వచ్చి చదువుకునేది. దీంతో ఆమెకు విజయం తలవంచింది. పీజీలో మంచి మార్కులతో పాసయ్యింది. అయితే ఆమెను పీహెచ్‌డీ చేయాలని ప్రోత్సహించారు అధ్యాపకులు.
ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు. కోచింగ్, అదనపు తరగతులు సాయం లేకుండా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందింది. ఇటీవల జరిగిన శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం చేపట్టగా.. భర్త, కూతురుతో కలిసి వేదికపై కి వచ్చింది. పారగాన్ చెప్పులు, ఓ సాదా చీర కట్టుకుని ఆమె వేదికను ఎక్కుతుంటే.. ఆమె ఎలా పీహెచ్‌డీ చేసిందని అందరి ముఖాల్లో ఆశ్చర్యం. ఇక ఆమె పీహెచ్‌డీతో వర్సిటీలో మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. తన కుటుంబ ఉన్నతి కోసం భారతి చేసి కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.