చనిపోయారనుకున్న వ్యక్తులు అంత్యక్రియల సందర్భంగా పైకి లేవటం.. ప్రాణాలతో తిరిగి రావటం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వాళ్ల దగ్గరి వరకు ఎవరో ఒకరు పాడెల మీదనుంచి, చితి మీద నుంచి పైకి లేస్తూ జనాలను ఆశ్చర్యంతో పాటు అవ్వాక్‌కు గురిచేస్తున్నారు. తాజాగా, 81 ఏళ్ల ఓ వృద్ధురాలు అంత్యక్రియల సందర్భంగా కళ్లు తెరిచింది. శ్మశానానికి తీసుకెళుతూ ఉండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని జర్సానా టౌన్‌కు చెందిన 81 ఏళ్ల హరిభేజీ అనారోగ్యం కారణంగా డిసెంబర్ 23న ఫిరోజాబాద్ ట్రోమా సెంటర్‌లో చేరింది.
మంగళవారం ఆమె మెదడు, గుండె పని చేయటం మానేశాయి. దీంతో క్లినికల్‌గా ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి తీసుకుపోయి అంత్యక్రియలు చేసుకోమన్నారు. కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. హరిభేజీ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఆమెను శ్మశానానికి తరలించటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హరిభేజీ ఠక్కున కళ్లు తెరిచింది. అది చూసిన బంధువులు ఉలిక్కిపడ్డారు. కొంతమంది దెయ్యం అని భయపడ్డారు. ఆమె బతికే ఉందని గుర్తించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం కన్నుమూసింది. కుటుంబసభ్యులు ఆమెను శ్మశానంలో ఖననం చేశారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయిపోయాయి’’.. ‘‘ ఇలాంటివేమీ వైద్య శాస్త్రంలో కొత్తేమీ కాదు’’.. ‘‘ అంతా దేవుడి నిర్ణయం.. ఎవరు, ఎప్పుడు, ఎలా చనిపోతారో ఎవ్వరికీ తెలియదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.