తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారారు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఒక్కసారే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. కానీ.. ఈ రౌడీ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల వరుసగా ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ భారత్ సరిహద్దులో ఉన్న వీర జవాన్లను కలిసి వారి కష్ట, సుఖాల గురించి తెలుసుకొని వారితో సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రముఖ జాతీయ మీడియా విజయ్ దేవరకొండతో ‘జై జవాన్’ అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రోమోలు నెట్టింట హల్ చల్ చేశాయి. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఉరి బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న వీర జవాన్లను కలిసి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాగే వారితో కలిసి యుద్ద విన్యాసాలు, యుద్దం వస్తే శత్రువులను ఎలా ఎదుర్కొవాలి, ఫైరింగ్, బోటింగ్ లాంటి విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు. వారితో ఉల్లాసంగా గడిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన స్టేజ్ షోలో సైనికులు తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కొంత మంది జవాన్లు డ్యాన్స్ చేస్తున్న సమయంలో విజయ్ దేవరకొండను స్టేజ్ పైకి పిలిచి తమతో డ్యాన్స్ చేయాల్సిందిగా కోరారు. వారి కోరిక మేరకు విజయ్ దేవరకొండ జవాన్లతో కలిసి స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. అంతేకాదు ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంలో ఓ డైలాగ్ చెప్పి అందరినీ ఉత్తేజపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.