సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే హీరోయిన్స్ గా కెరీర్ మొదలుపెట్టిన ముద్దుగుమ్మలు.. 40 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా పెళ్లి విషయంలో స్పందించడం లేదు. గతంలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకొని.. యథావిధిగా సినిమాలు చేస్తుండేవారు. అదీగాక అప్పట్లో హీరోయిన్స్ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ నాలుగైదు సినిమాలకే ఇండస్ట్రీలో కనుమరుగైపోవడం చూస్తున్నాం. ఇదివరకు హిట్స్ ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్, అవకాశాలు అలాగే ఉండేవి. కానీ.. ఇప్పుడు ఒక్క ప్లాప్ పడినా హీరోయిన్ల తదుపరి సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పూర్తిచేసుకున్న స్టార్ హీరోయిన్ త్రిషకి మరోసారి పెళ్లి ప్రశ్నే ఎదురైంది.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సినిమా రిలీజ్ ముందు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వదిలినట్లుగా లవ్, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ పోస్టులతో పెళ్లి కబురు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిషకు పెళ్లి ప్రశ్నే అడిగారట. దానికి అమ్మడు అందరూ ఖంగుతినేలా సమాధానం చెప్పిందట. ఇన్నేళ్లయినా త్రిష ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. “త్రిష ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేకంటే.. త్రిష పెళ్లి ఎప్పుడు? అని అడిగితే బాగుంటుంది. అయినా నా పెళ్లి అనేది నా వ్యక్తిగతం. సో నా పెళ్లి ఎప్పుడు అనేది కూడా నేను ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నాతో లైఫ్ లాంగ్ కలిసుండే వ్యక్తి కావాలి.
ఇప్పటివరకు నేను చూసినవారిలో, నా చుట్టూ ఉన్నవాళ్లలో చాలామంది పెళ్లి తర్వాత ఆనందంగా లేరు. మధ్యలోనే విడిపోవడం చూశాను. అలా పెళ్లి చేసుకున్నాక నాకు విడిపోవడం, విడాకులు తీసుకోవడం నచ్చదు.. ఇష్టం కూడా లేదు. కొద్దికాలానికే మూతబడే బంధాలు నాకు అవసరం లేదు. అందుకే నా పెళ్లి ఇంకా ఆలస్యం అవుతోంది” అని చెప్పుకొచ్చింది త్రిష. ఇదిలా ఉండగా.. 39 ఏళ్ళు నిండినా త్రిష ఇంకా తన అందచందాలతో కుర్రహీరోయిన్లకు పోటీనిస్తునే ఉంది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అయితే.. గతంలో త్రిష ఓ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని, పెళ్లి వరకూ వెళ్ళలేదు. ఆ చేదు అనుభవం వల్లనే త్రిష ఇలా మాట్లాడుతుందేమో అని అనుకుంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి త్రిష ఎప్పుడు తీపి కబురు చెబుతుందో!