కరోనా సినిమా ఇండస్ట్రీ లెక్కలనే కాదు.., పద్ధతులను కూడా మార్చేసింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోసే కాదు.. స్టార్ డైరెక్టర్స్ కూడా తమ పంథా మారుస్తున్నారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను పైప్ లైన్లో పెడుతూ.. వరుస చిత్రాలతో హల్ చల్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తన 20 ఏళ్ల కెరీర్ లో కేవలం 11 చిత్రాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబుతో ఒక చిత్రం.. ఇండియన్ యాక్టర్స్ తో ఇండియన్ కంటెంట్ తో ఓ హాలీవుడ్ మూవీని పైప్ లైన్లో పెట్టాడు దర్శకధీరుడు. మొత్తంమీద.. ‘ట్రిపుల్ ఆర్’తో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్.. ప్రస్తుతానికి జక్కన్న కిట్టీలో ఉన్నాయి.
రాజమౌళి తరహాలోనే తన రెండు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్ లో కేవలం 11 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ స్టార్ డైరెక్టర్ కూడా ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలను పైప్ లైన్లో పెట్టాడు. తన మిత్రుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అయ్యపనుమ్ కోషియుమ్’కి స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్న త్రివిక్రమ్.. త్వరలో మహేశ్ బాబుతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, వెంకటేశ్ లతో సినిమాలు చేయాల్సి ఉంది. సో.. తివిక్రమ్ చాలా బిజీ అనమాట.
ఇక.. 17 సంవత్సరాల సినీ కెరీర్ లో కేవలం 7 సినిమాలను మాత్రమే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు మరో డైరెక్టర్ సుకుమార్. అయితే.. ఇప్పుడు ఈ లెక్కల మాస్టర్ వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం.. అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. దీని తర్వాత మహేశ్ తోనూ ఒక సినిమా చేయాల్సి ఉంది. సో.., ఇప్పాటిలో సుకుమార్ సర్ డేట్స్ లేనట్టే.
ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అపజయమెరుగని మరో దర్శకుడు ఎవరంటే కొరటాల శివ. పేరే వినిపిస్తుంది. ఎమ్మిదేళ్ల కెరీర్ లో కేవలం నాలుగు సినిమాలను మాత్రమే విడుదల చేసిన కొరటాల.. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్-30 లైన్ లో ఉంది. తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల ఓ మూవీ చేయాల్సి ఉంది. ఆ తరువాత చరణ్ కూడా క్యూ లో ఉన్నాడు. సో.. కొరటాలకి ఫ్రీ అవ్వడం ఇప్పట్లో జరిగే పని కాదు.
ఇక ఇప్పుడు టాలీవుడ్ లోని టాప్ హీరోస్ శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో ‘సలార్’, ఎన్టీఆర్ తో మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్.. ఆ తర్వాత రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలను కూడా లైన్లో పెడుతున్నాడట. ఇక.. ప్రభాస్ తో ‘సలార్’ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ మైథలాజికల్ మూవీని ప్రశాంత్ నీల్ చేస్తాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. సో.., ఇలా స్టార్ డైరెక్టర్స్ అంతా వరుస చిత్రాలను లైన్ లో పెట్టి.., బిజీ బిజీగా గడిపేస్తున్నారు.