తెలుగు భాష అన్నా, తెలుగు సినిమా అన్నా, తెలుగు సినిమా నటులన్నా ఒకప్పుడు చులకన భావం ఉండేది. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అని, హిందీ సినిమా మాత్రమే అనే అహంభావంతో ఉండేవారు. ఇదే విషయం మీద 15 ఏళ్ల క్రితం చిరంజీవి తన బాధను బయటపెట్టారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చిరంజీవి స్పీచ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. “గోవా, న్యూఢిల్లీ, బాంబే లాంటి చోట్ల ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే అక్కడ తెలుగు నటులకు గుర్తింపు లేదు. నేను గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మహానటుడు రామారావు బొమ్మ లేదు, అక్కినేని నాగేశ్వరరావు బొమ్మ లేదు. మా మాట సరేసరి. ఇదీ మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా వరకే వెళ్లలేకపోయాం” అని చిరంజీవి తన ఆవేదన వ్యక్తం చేశారు.
కట్ చేస్తే చిరంజీవి ఆవేదనను కాలం సీరియస్ గా తీసుకుందేమో.. చిరంజీవి బాధను కర్మ సీరియస్ గా తీసుకుందేమో.. చిరంజీవి అనుకున్న మార్పు వచ్చేసింది. ఏ గడ్డమైతే చిరంజీవి మనకి గుర్తింపు లేదని ఆవేదన చెందారో.. ఈరోజు అదే గడ్డ మీద తెలుగు వాళ్ళు జెండా ఎగరేస్తున్నారు. ఇదీ మన గుర్తింపు. ఇదీ చిరంజీవి కోరుకున్న గుర్తింపు. ఇదీ చిరంజీవి కావాలనుకున్న మార్పు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో తెలుగు సినిమాలకు అత్యున్నత స్థానం లభించింది. ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి.
ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు సినీ ఖ్యాతిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్.. అలానే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలతో పాటు ఓటీటీలో ఆడిన సినిమా బండి, ఖుదీరామ్ బోస్ సినిమాలు ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. మరో గొప్ప విషయం ఏంటంటే.. తెలుగులో అడివి శేష్ నటించిన మేజర్ సినిమా హిందీ వెర్షన్ కూడా ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఎంపికైనది. వీటితో పాటు తెలుగు నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కీడా.. మరో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన హిందీ సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ కూడా ఇండియన్ పనోరమాకు ఎంపికయ్యాయి.
ఇక ఇండియన్ రెస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శితం కానున్న 5 సినిమాల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన అద్భుత కళాఖండం శంకరాభరణం సినిమా ఉంది. అలానే ఇటీవల కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళిగా కొన్ని సినిమాలను ప్రదర్శించనున్నారు. కృష్ణంరాజు, కృష్ణ వంటి ప్రముఖులకు నివాళిగా వారు నటించిన సినిమాలను చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఈసారి ఇండియన్ పనోరమా చిత్రాల ఎంపిక కమిటీలో ఇద్దరు తెలుగు దర్శకులకు చోటు దక్కింది. వీరిలో ఒకరు వి.ఎన్. ఆదిత్య కాగా.. మరొకరు ప్రేమ్ రాజ్. ఏది ఏమైనా గానీ ఈసారి గోవాలో జరగబోయే చిత్రోత్సవంలో తెలుగు వాళ్ళు సందడి చేయడం అనేది శుభ పరిణామం అనే చెప్పుకోవాలి.
దీనికి ప్రధానమైన కారణం రాజమౌళి.. ఆ తర్వాత ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యువ హీరోలనే చెప్పాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినటువంటి హీరోలు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క తదితరులు. ఆ తర్వాత మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి తెలుగు వాళ్ళ ఖ్యాతిని కొన్ని వందల రెట్లు పెంచేశారు. తెలుగు సినిమాని, తెలుగు సినిమా వాళ్ళని తలెత్తుకునేలా చేశారు. చిరంజీవి ఆరోజు ఏ గుర్తింపు ఐతే లేదని బాధపడ్డారో.. ఈరోజు ఆ గుర్తింపు మనకి గోవాలో దక్కింది. ఆరోజు ఏ హీరోల బొమ్మలు లేవని బాధపడ్డారో.. ఈరోజు అదే హీరోల బొమ్మలు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడే పరిస్థితి వచ్చింది. తెలుగు వారి బొమ్మలు, కటౌట్ లు అక్కడ వెలిసే పరిస్థితి వచ్చింది.
Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur !
My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI— Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022
చిరంజీవి తనకు, మన తెలుగు నటులకు, తెలుగు సినీ పరిశ్రమకు జరిగిన అవమానాన్ని తలచుకుని బాధపడ్డారో.. ఆ అవమానమే ఈరోజు అభిమానంగా మారింది. వారంతట వారే అభిమానించేలా తెలుగు సినిమా ఖ్యాతి పెరిగింది. చిరంజీవితో సహా అనేక మంది తెలుగు సినీ ప్రముఖులకు గోవాలో జరుగుతున్న చిత్రోత్సవంలో అత్యున్నత గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేయడం గర్వకారణం. గోవాలో జరుగుతున్న చిత్రోత్సవంలో తెలుగోళ్ళ సత్తా, తెలుగు సినిమాల హవా చూసి.. అప్పట్లో చిరంజీవి కోరుకున్న గుర్తింపు ఇదే కదా.. ఆయన కోరుకున్న మార్పు ఇదే కదా.. అని కామెంట్స్ చేస్తూ.. 15 ఏళ్ల క్రితం చిరంజీవి మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. ఇది కదా తెలుగోడి దెబ్బ అంటే.
Goa international film festival honoured #Chiranjeevi as best Indian film personality of 2022. This is our achievement. #WaltairVeerayya #Chiru154 #MegaStarChiranjeevi pic.twitter.com/YkMvEBujLO
— Samanyudu (@Samanyudu07) November 20, 2022