తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కమెడియన్స్ లో లక్ష్మీపతి ఒకరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెదబాబు వంటి సినిమాల్లో లక్ష్మీపతి చేసిన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా సునీల్, లక్ష్మీపతి కాంబినేషన్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు ఎప్పుడు చూసినా కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అలాంటి మనిషి 2008లో మరణించారు. ఈయన కంటే ముందు ఈయన తమ్ముడు శోభన్ నెల రోజుల క్రితం మరణించారు. వర్షం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శోభన్.. గుండెపోటుతో మరణించగా.. నెల రోజుల తరువాత లక్ష్మీపతి మరణించారు. ఇలా నెల రోజుల వ్యవధిలో తండ్రిని, బాబాయ్ ని కోల్పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి కూతురు శ్వేతా లక్ష్మీపతి వెల్లడించారు.
లక్ష్మీపతికి ఇద్దరు తమ్ముళ్లు. సొంత ఊరిలో రెండు థియేటర్లు ఉండేవి. లక్ష్మీపతి ఓ టీవీ ఛానల్ లో స్క్రిప్ట్ రైటర్ గా, యాంకర్ గా చేసేవారు. టీవీ రంగంలో ఉండగానే చూడాలని ఉంది సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టడంతో టీవీ ఫీల్డ్ ని వదిలేసి.. పూర్తిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. అప్పటికే ఆయన తమ్ముడు శోభన్ ఇండస్ట్రీలో ఉన్నారు. కృష్ణ నటించిన రైతు భారతం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. కొన్నాళ్ల తర్వాత మహేష్ బాబుతో బాబీ సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే బాబీ సినిమా ఓపెనింగ్ కి తనను తీసుకెళ్లారని.. అప్పుడే మహేష్ ని, కృష్ణని మొదటిసారిగా చూశానని శ్వేతా లక్ష్మీపతి అన్నారు.
అయితే బాబీ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కుటుంబం ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని, బాబాయ్ ప్రతిష్ట కూడా దెబ్బతిందని అన్నారు. బాబీ ఫ్లాప్ తో పాఠం నేర్చుకున్న బాబాయ్.. వర్షం సినిమాని చాలా కసిగా తీశారని అన్నారు. కోల్పోయిన ప్రతిష్ట మొత్తం తిరిగి వచ్చిందని అన్నారు. అయితే ఆ తర్వాత రవితేజతో తీసిన చంటి సినిమాతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. తన బాబాయ్ చనిపోయినప్పుడు తన తండ్రి జీర్ణించుకోలేకపోయారని.. అంత్యక్రియల సమయంలో ఆ బాధని మర్చిపోవడానికి తగి వచ్చారని.. అది నచ్చక ఆయనతో గొడవ పడ్డానని ఆమె అన్నారు. బాబాయ్ చనిపోయిన సమయంలో తన తండ్రి తనను పట్టుకుని ఏడ్చేశారని గుర్తు చేశారు.
అయితే అందరూ ఏడుస్తున్నా.. తాను మాత్రం ఏడ్చేదాన్ని కాదని.. అందరూ నిద్రపోయాక రాత్రుళ్ళు ఏడ్చేదాన్నని ఆమె అన్నారు. ఇక తన తండ్రి చనిపోయినప్పుడు తాను అధైర్యపడితే.. తన కన్నా చిన్నవాళ్ళైన తన తమ్ముడు, బాబాయ్ కొడుకులు భయపడతారని.. అందుకే వాళ్ళ బాధ్యత కూడా తానే తీసుకున్నానని ఆమె అన్నారు. వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేసిన శ్వేతా లక్ష్మీపతి.. తండ్రి, బాబాయ్ ల మీద ప్రేమతో ఒక పుస్తకాన్ని రాశారు. ఇక శోభన్ కొడుకులిద్దరూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరు సంతోష్ శోభన్ కాగా.. మరొకరు సంగీత్ శోభన్. తను నేను పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో డీసెంట్ హిట్ స్ అందుకోగా.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ తో సంగీత్ శోభన్ మంచి హిట్ కొట్టారు.